ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు అలా అన‌డంతో షాక్ అయ్యాను - హీరో ఉద‌య్ శంక‌ర్

By Newsmeter.Network  Published on  5 Dec 2019 12:02 PM GMT
ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు అలా అన‌డంతో షాక్ అయ్యాను - హీరో ఉద‌య్ శంక‌ర్

‘ఆటగదరా శివ’ అనే విభిన్న క‌థా చిత్రంతో.. సహజమైన నటనతో ఆక‌ట్టుకున్న యువ హీరో ఉద‌య్ శంక‌ర్. తాజాగా ఉదయ్‌ శంకర్‌, ఐశ్వర్య రాజేష్ తో క‌లిసి ‘మిస్‌ మ్యాచ్‌’ అనే సినిమాలో న‌టించాడు. ఎన్‌.వి. నిర్మల్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శ కత్వం వహించారు. డిసెంబర్‌ 6న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర విశేషాల‌ను మీడియాతో పంచుకున్నారు హీరో ఉద‌య్ శంక‌ర్. ఈ మూవీ గురించి చెబుతూ... నేను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని. ‘తొలిప్రేమ’ నా ఫేవరెట్‌ ఫిల్మ్‌. ‘ఈ మనసే’ నా ఆల్‌టైం ఫేవరెట్‌ సాంగ్‌ కూడా. 'తొలిప్రేమ' సినిమా చూసిన‌ప్పుడు నేను భ‌విష్య‌త్తులో హీరో అయ్యి.. ఓ ల‌వ్‌స్టోరీ చేస్తే అందులో ఈ పాట‌ను రీమేక్స్ చేయాల‌ని అనుకున్నాను. ఎలాగూ ఇది లవ్‌స్టోరీ కాబ‌ట్టి ఆ పాట‌ను ఇందులో తీసుకోవ‌చ్చా? అని భూపతిరాజాగారిని అడిగాను. ఆయ‌న క‌థ ఫ్లో ఎక్క‌డా మిస్ కాకుండా సెకండాఫ్‌లో పాట‌ను యాడ్ చేయ‌వ‌చ్చ‌ని అన్నారు.

అయితే... ఎలా చేయాలి? ఎక్క‌డ చేయాలి? అని తెగ ఆలోచించాం. విదేశాల్లో కూడా చిత్రీక‌రించాల నుకున్నాం. అయితే చివ‌ర‌కు హైద‌రాబాద్‌లో చేద్దామ‌ని విజ‌య్ మాస్ట‌ర్ అన్నారు. అదేంటి? అన‌గానే కొత్త‌గా చేద్దామ‌న్నారు. ఇప్ప‌టికే నితిన్‌గారు ఈ పాట‌ను రీమిక్స్ చేసున్నారు. మ‌రి మ‌న‌మెలా కొత్త‌గా చేద్దామ‌ని అనుకున్నాం. అయితే విజ‌య్‌గారు ఈ సాంగ్‌ను సింగిల్ షాట్‌లోనే చేసేద్దామ‌ని ఆయ‌న అన్నారు. నేను షాకయ్యా. ఐశ్వర్య కూడా బాగా సహకరించింది.

ఐదు రోజుల పాటు 60 మంది డ్యాన్స‌ర్స్‌, 120 మంది టెక్నీషియ‌న్స్ 5 రోజుల పాటు బాగా ప్రాక్టీస్ రామోజీ ఫిల్మ్‌ సిటీలోని లండన్‌ స్ట్రీట్లో సాంగ్‌ను చిత్రీక‌రించాం. ఈ సాంగ్‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు విడుద‌ల చేశారు. ఆయ‌నకు ఇది సింగిల్ షాట్‌లో చేసిన పాట అని చెప్ప‌లేదు. ఆయ‌న సాంగ్ చూసి హామ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇది సింగిల్ టేక్‌లో చేశారుగా అని అనడంతో షాక్ అయ్యాను. ఇందులో నీ క‌ష్టం క‌న‌ప‌డుతుంది అన్నారు. ఆయ‌నకే ఆ పాట న‌చ్చిన త‌ర్వాత ఇక ఫ్యాన్స్‌కు న‌చ్చ‌కుండా ఉంటుందా! త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది అన్నారు హీరో ఉద‌య్ శంక‌ర్.

Next Story
Share it