'90ఎంఎల్' మూవీ రివ్యూ

By Newsmeter.Network  Published on  6 Dec 2019 11:14 AM GMT
90ఎంఎల్ మూవీ రివ్యూ

ఆర్ఎక్స్ 100 సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన యువ హీరో కార్తికేయ, నేహ సోలంకి జంట‌గా న‌టించిన చిత్రం 90 ఎంఎల్. ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి య‌ర్ర ద‌ర్శ‌కత్వం వ‌హించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా ఈ రోజు (డిసెంబ‌ర్ 6)న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. మ‌రి.. 90 ఎంఎల్ కార్తికేయ‌కు విజ‌యాన్ని అందించిందా..? లేదా..? అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ - దేవ‌దాస్ (కార్తికేయ‌) పుట్టిన‌ప్పుడు అస‌లు ఏడ‌వ‌డు. పుట్టిన పిల్లాడు ఎందుకు ఏడ‌వ‌డం లేదు అని న‌ర్స్ కంగారు ప‌డుతుంది. అప్పుడు ఆ..పిల్లోడు మందు వాస‌న పీల్చ‌డం ద్వారా ఏడ‌వ‌డం స్టార్ట్ చేస్తాడు. అలా పుట్టిన‌ప్ప‌టి నుంచి ఆల్క‌హాల్ సిండ్రోమ్‌తో ఇబ్బంది ప‌డుతుంటాడు. రోజుకు మూడు పూట‌లు తాగాలి అలా చేయ‌క‌పోతే ప్రాణానికే ప్ర‌మాదం అని డాక్ట‌ర్ చెబుతారు.

ఇత‌ని జ‌బ్బు గురించి తెలిసి ఎవ‌రు ఉద్యోగం ఇవ్వ‌రు. అయితే.. ఓసారి అనుకోకుండా ఓ చిన్న‌పిల్లాడు ప్ర‌మాదంలో ఉంటే.. దేవ‌దాస్ వెళ్లి కాపాడ‌తాడు. అప్పుడు అత‌నికి సువాస‌న (నేహ సోలంకి) పరిచ‌యం అవుతుంది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారుతుంది. అయితే.. సువాస‌నకి కానీ.. వాళ్ల ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి కానీ.. తాగేవాళ్లు అంటే అస‌లు ఇష్టం ఉండ‌దు. ఈ విష‌యం తెలుసుకుని దేవ‌దాస్, సువాస‌న ద‌గ్గ‌ర ఈ నిజం దాస్తాడు.

ఓసారి అనుకోకుండా దేవ‌దాస్ తాగుతాడ‌ని తెలిసిపోతుంది. ఆమెకు అస‌లు విష‌యం చెప్పాల‌ని ఎంత ప్ర‌య‌త్నించినా వినిపించుకోదు. సువాస‌నని ప్రేమించ‌డం వ‌ల‌న‌ జాన్, శేషుల‌తో దేవ‌దాస్ కి గొడ‌వ‌లు జ‌రుగుతాయి. ఈ గొడ‌వ‌లు వ‌ల‌న దేవ‌దాస్ ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాడు..? చివ‌రికి ఈ దేవ‌దాస్ ప్రేమ‌ను సువాస‌న అంగీక‌రించిందా..? లేదా..? అనేది మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

కార్తికేయ న‌ట‌న‌

అనూప్ మ్యూజిక్

జ‌య‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్

క‌థ‌, క‌థ‌నం

సినిమా నిడివి

కామెడీ సీన్స్

విశ్లేష‌ణ

కార్తికేయ దేవ‌దాస్ పాత్ర‌కు పూర్తి న్యాయం చేసాడు. అలాగే నేహా సోలంకి పాత్ర ప‌రిధి మేరకు చ‌క్క‌గా న‌టించింది. ఈ సినిమాకి మైన‌స్ అంటే.. క‌థ, క‌థ‌నం. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాలో హీరోకు మ‌తిమ‌రుపు అనే జ‌బ్బు పెట్టి కామెడీ పండించారు. ఆ సినిమా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఆ సినిమాని స్పూర్తిగా తీసుకున్నాడేమో.. హీరోకు మూడు పూట‌ల తాగ‌క‌పోతే ప్రాణానికే ప్ర‌మాదం అనే జ‌బ్బు పెట్టి క‌థ రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు.

ఇలాంటి క‌థ‌ను ఎంచుకోవ‌డ‌మే రిస్క్, కొత్త‌గా ఉంటుంద‌ని రాసుకుంటే... క‌థ‌నం ఆస‌క్తిగా ఉండేలా రాసుకోవాలి కానీ... అవేమీ ఆలోచించ‌కుండా హీరోకు మందు జ‌బ్బు అనే ఈ జ‌బ్బును తీసుకుని రెండున్న‌ర గంట‌లు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాల‌ని ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యాడు. హీరో త‌న‌కున్న మందు జ‌బ్బు గురించి అంద‌రికీ చెబుతాడు కానీ.. త‌న ప్రియురాలికి మాత్రం చెప్ప‌డు.

ఎందుకు చెప్ప‌డో అర్ధంకాదు. ఇలా చెప్పాలంటే సినిమాలో చాలా మైన‌స్ లు ఉన్నాయి. నిర్మాత అశోక్ రెడ్డి ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు పూర్తి న్యాయం చేసారు కానీ.. ద‌ర్శ‌కుడు స‌రైన క‌థ‌ను ఎంచుకోక‌పోవ‌డం.. బ‌ల‌మైన స‌న్నివేశాల‌ను రాసుకోక‌పోవ‌డం వ‌ల‌న 90 ఎంఎల్ మెప్పించ‌లేక‌పోయింది.

రేటింగ్ - 2/5

Next Story