హైదరాబాద్ లో మూడేళ్ల పాపకు వోటర్ ఐడీ కార్డ్

By రాణి  Published on  4 Jan 2020 12:08 PM IST
హైదరాబాద్ లో మూడేళ్ల పాపకు వోటర్ ఐడీ కార్డ్

ముఖ్యాంశాలు

  • హైదరాబాద్ లో మూడేళ్ల పాపకు వోటర్ ఐడీ కార్డ్
  • మారుతీ నగర్ లో వెలుగుచూసిన నిజం
  • అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యం
  • మునిసిపల్ ఎన్నికల నేపధ్యంలో గందరగోళం
  • ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలు
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న రాజకీయ పార్టీల నేతలు

భారతదేశంలో ఓటు హక్కు 18 సంవత్సరాలకు వస్తుంది. కానీ విచిత్రంగా హైదరాబాద్ లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడేళ్ల చిన్నారికికూడా వోటర్ ఐడీ కార్డ్ మంజూరయ్యింది. మునిసిపల్ ఎన్నికలు దగ్గర్లోనే ఉన్న నేపధ్యంలో ఈ ఘటన సామాన్య జనంలో కలకలం రేపుతోంది.

ఓటర్ల జాబితాను రూపొందించే, సరిచూసే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన కళ్లకు కడుతోందని సగటు ఓటర్లు తీవ్ర స్ధాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఉద్దేశ పూర్వకంగానే ఓటర్ల జాబితాలో అవకతవకలు చేస్తున్నారనడానికి ఇదే సాక్ష్యమంటూ మండిపడుతున్నారు.

YOJ8588352 నెంబర్ తో మారుతీ నగర్ డోర్ నెంబర్ 5-6-434 అడ్రస్ మీద జారీ అయిన ఈ వోటర్ ఐడీ కార్డ్ లో మూడేళ్ల పాప వయసును 35 ఏళ్లుగా రాశారు. మూడేళ్ల ఈ పాప స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ చదువుతోంది. పైగా వోటర్ ఐడీ కార్డ్ లో ఆ పాప సంవత్సరం వయసులో ఉన్న ఫోటోను ముద్రించడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచింది.

జనవరి 22 నుంచి 25వరకూ జరిగే మునిసిపల్ ఎన్నికలకోసం సిద్ధం చేసిన ఓటర్ల జాబితాలో బోలెడన్ని లొసుగులు ఉన్నాయని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అనేకమంది ఓటర్ల కులాన్ని ఓటరు కార్డుల్లో తప్పుగా ముద్రించడంపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని కార్డుల్లో పేర్లు రెండుసార్లు అచ్చయ్యాయి. కొందరి ఫోటోలు, పేర్లూ మారిపోయాయి. మొత్తంగా ఓటర్ల జాబితా గందరగోళంగా తయారయ్యిందని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. దీనివల్ల మునిసిపోల్స్ ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందంటున్నారు. మరీ పసిపాపకు వోటర్ కార్డ్ జారీ చేయడమంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని అపహాస్యం చేయడమేనంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Next Story