అనుకున్నది సాధించింది.. కానీ, రోడ్డు ప్రమాదమే..
By అంజి Published on 1 Jan 2020 4:54 AM GMT
హైదరాబాద్: తను తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా కష్టపడింది. పట్టుదలతో చదువుల్లో రాణించింది, అనుకున్నది సాధించింది. మంచి ఉద్యోగంలో స్థిరపడింది. తాను, తల్లిదండ్రులు అంతా సంతోషం. అంతలోనే విషాదం. తానోకటి తలిస్తే.. దైవమొకటి తలుస్తాడు కదా..! అదే జరిగింది. ఈ కొత్త సంవత్సరం పూట వారింట విషాదం నిండుకుంది.
వివరాళ్లోకెళితే.. నగరంలోని నేరేడ్‌మెట్ ప్రాంతం రేణుకానగర్‌కు చెందిన చంద్రారెడ్డి, శోభ దంపతుల కూతురు ఎల్ల చరితారెడ్డి. పట్టుదలతో చదివి అనుకున్నది సాధించిన ఈ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికా రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యి మరణించింది. దీంతో చరితారెడ్డి కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
జీవితంలో ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న కూతురుకు తల్లిదండ్రులు వివాహం చేయాలని అనుకున్నారు. ఇందుకు మరికొన్ని రోజుల్లో చరితారెడ్డి ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో రోడ్డు ప్రమాదం రూపంలో ఆమెను మృత్యువు పలకరించింది.
శుక్రవారం రోజున స్నేహితులతో కలిసి అమెరికాలోని మిచిగావ్‌లో రోడ్డు పక్కన ఆగి ఉన్న చరితా రెడ్డి కారును వెనుక నుండి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. దీంతో బ్యాక్‌సీటులో కూర్చున్న చరితారెడ్డి తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ అయ్యి మరణించింది. కూతురు మరణ వార్త తెలిసిన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.
ప్రాథమిక విధ్యాబ్యాసమంతా నేరేడ్‌మెట్‌లోనే చదివిన చరితా రెడ్డి.. గీతం కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేసింది. అనంతరం 2015లో ఆమె ఎంఎస్ చదవటానికి అమెరికా వెళ్లింది. అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన చరితారెడ్డి ఇండియాకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత డెలాయిట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో తిరిగి అమెరికా వెళ్లింది. మూడేళ్లుగా అక్కడే ఉద్యోగం చేస్తుంది. ఈ హఠాత్తు పరిణామంతో నిండు జీవితాన్ని రుచి చూడకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో నింపిన చరితారెడ్డి.. తన అవయవాలను దానం చేసి మరో తొమ్మిది కొత్త జీవితాలకు వెలుగులు నింపింది. చరితా రెడ్డి కుటుంబ సభ్యుల పర్మిషన్‌తో ఆమె అవయవాలను వైద్యులు డొనేట్ చేశారు. ఈ సందర్భంగా చరితారెడ్డి కుటుంబ సభ్యులకు అక్కడి వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో చరితారెడ్డి త్యాగాన్ని అక్కడి సమాజం కీర్తిస్తోంది. షీ ఈజ్ మై సూపర్ హీరో అంటూ చరితారెడ్డి రెడ్డి కుటుంబ సభ్యులు అంటున్నారు.