సియాచిన్‌లో మంచు చరియలు విరిగిపడి నలుగురు సైనికులు, ఇద్దరు హమాలీలు మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Nov 2019 7:29 AM GMT
సియాచిన్‌లో మంచు చరియలు విరిగిపడి నలుగురు సైనికులు, ఇద్దరు హమాలీలు మృతి

అత్యధిక హిమపాతం ఉండే సియాచిన్ ప్రాంతంలో పెద్దఎత్తున మంచు చరియలు విరిగిపడి ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో మంచుపెళ్లలు ఆర్మీక్యాంపును ముంచెత్తాయి. ఆ సమయంలో గస్తీలో ఉన్న ఎనిమిది మందిలో నలుగురు జవాన్లు, ఇద్దరు హమాలీలు ప్రాణాలు కోల్పోయారు. మంచు చరియలకింద ఇరుక్కుపోయినవాళ్లందరినీ బయటికి తీసేలోపుగానే రక్తం పూర్తిగా గడ్డకట్టడంవల్ల వారి ప్రాణాలు పోయాయి. నలుగురి జవాన్లు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఇద్దరు హమాలీలను దగ్గర్లోని మిలటరీ ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది.

ముఖ్యాంశాలు

  • సోమవారం మధ్యాహ్నం గం. 3:30 ని. సమయంలో ఆర్మీ క్యాంపును మంచుచరియలు ముంచెత్తాయి
  • రెస్క్యూ ఆపరేషన్ లో మంచులో చిక్కుకుపోయినవారినందరినీ బయటికి తీశారు
  • రక్తం పూర్తిగా గడ్డకట్టుకుపోవడంతో నలుగురు జవాన్లు, ఇద్దరు హమాలీలు చనిపోయారు

నవంబర్ 18వ తేదీ మధ్యాహ్నం గం.3.30 ని. సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. గస్తీలో ఉన్న ఎనిమిది మంది జవాన్లు, వారితోపాటు ఉన్న సామానులు మోసే హమాలీలు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు.

లద్దాక్ లోని ఆర్మీక్యాంప్ ఉన్నపళంగా ఒక్కసారిగా మంచుతోకప్పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంచుచరియలకింద కూరుకుపోయిన ఎనిమిదిమందిని పూర్తిగా బయటకు తీయగలిగారు. వారిలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.

రక్తం పూర్తిగా గడ్డకట్టుకుపోవడంవల్ల ఘటనా స్థలంలోనే నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మిగతా ముగ్గురినీ అత్యవసర చికిత్సకోసం మిలటరీ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఎన్నో విధాలుగా ప్రయత్నించినప్పటికీ డాక్టర్లు ఇద్దరు హమాలీల ప్రాణాలను కాపాడలేకపోయారని ఆర్మీ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు.

Rajnathsingh

19000 అడుగుల ఎత్తున ఉన్న ఈ అర్మీక్యాంప్ లో విధులు నిర్వహించడమంటే నిజానికి ప్రాణాలతో చెలగాటమాడడమే. కానీ జవాన్లు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ, ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణకోసం విధులు నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలోకూడా ఈ ప్రాంతంలోనే ఇలాంటి పెద్ద ప్రమాదం మరొకటి జరిగింది. మంచు చరియలు విరిగిపడడంతో 35 అడుగుల లోతున పదిమంది జవాన్లు అప్పట్లో మంచుకింద కప్పడిపోయారు. 150 మంది ఆర్మీ జవాన్లు రెస్య్యూ ఆపరేషన్ లో పాల్గొని కొన్ని గంటల తర్వాత లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ ని బయటకు తీయగలిగారు. ప్రమాదంనుంచి బయటపడిన మూడు రోజుల తర్వాత ఆ జవానుకూడా ప్రాణాలు కోల్పోయాడు.

Next Story