నేడు వైఎస్సార్ జయంతి.. ప్రత్యేక కార్యక్రమాలు ఇవే..
By సుభాష్ Published on 8 July 2020 8:37 AM ISTదివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. మంగళవారం ఇడుపులపాయకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్.. కుటుంబ సభ్యులు, బంధువులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పలు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పోలీసుల నుంచి జగన్ గౌరవ వందనం స్వీకరించనున్నారు.
జగన్ పాల్గొనే కార్యక్రమాలు
గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు అధునాతన విద్య అందించేందుకు ఇడుపులపాయలో ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్‌ఐటీలో రూ.139.83 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన ఇంజనీరింగ్ తరగతులను జగన్ ప్రారంభిస్తారు. ట్రిపుల్ ఐటీకి వాడే విద్యుత్ వ్యయాన్ని తగ్గించేందుకు ఇడుపులపాయ నెమళ్ల పార్క్ పక్కన మూడు మెగావాట్ల సామర్థ్యంతో రెస్కో కోలబ్రేషన్ పరిజ్ఞానంతో సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించారు. అందులో 18 ఎకరాల ట్రిపుల్ ఐటీ స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్‌ఐటీకి యూనిట్‌కు రూ.7.66తో విద్యుత్ బిల్లును చెల్లిస్ఉతన్నారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా యూనిట్‌కు రూ.3.45 బిల్లును చెల్లించవచ్చు. దీంతో ప్రతి సంవత్సరం రూ.1.81 కోట్ల మేరకు ఆర్జీయూకేటీ యూనివర్సిటీకి ఆదా అవుతుంది. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని సైతం సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు.
అలాగే ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా జగన్ ఆవిష్కరిస్తారు. ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో రూ.10.10 కోట్లతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. ఇంకా క్యాంపస్‌లో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో 2,500 విద్యార్థులకు సరిపడేలా వైఎస్సార్ ఆడిటోరియంకు శంకుస్థాపన చేస్తారు.