నేడు కేంద్ర కేబినెట్ భేటీ
By సుభాష్
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ను మే 31 వరకూ కేంద్రం పొడిగించిన విషయం తెలిసిందే. అందుకు మార్గదర్శకాలు సైతం నిన్న రాత్రి విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మే 20న (నేడు) ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో లాక్ డౌన్ పరిస్థితులు, పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత వారం ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వివరాలపై వస్తున్న సమాచారంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కాగా, రెండు నెలలుగా కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా అతలాకుతలం చేస్తోంది. దీంతో ఇప్పటి వరక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష వరకు దాటింది. ఇక కరోనా కట్టడికి కేంద్రం విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా పడిపోయింది. ఇక ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు పలు ప్యాకేజీలను ప్రకటించింది
అయితే ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ వల్ల ఎలాంటి లాభం లేదని విపక్షాలతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు సైతం తప్పుబడుతున్నాయి. అంతేకాదు సోమవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఉత్తి బోగస్ అంటూ విమర్శలు గుప్తించారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా కేంద్ర ఆర్థిక ప్యాకేజీపై పెదవి విరిచింది. కేంద్ర ఆర్థిక ప్యాకేజీపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మోదీ నేతృత్వంలో కేబినెట్ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.