2025 నాటికి అప్‌గ్రేడ్ కానున్న తిరుపతి రైల్వే స్టేషన్
Upgradation of Tirupati Railway Station to be completed by Feb, 2025. తిరుపతి : రానున్న 40 ఏళ్లపాటు రైలు ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు తిరుపతి రైల్వేస్టేషన్
By అంజి Published on 7 Feb 2023 5:37 PM ISTతిరుపతి : రానున్న 40 ఏళ్లపాటు రైలు ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు తిరుపతి రైల్వేస్టేషన్ అప్‌గ్రేడేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. 2022 మేలో అప్‌గ్రేడేషన్ పనులను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే.. ప్రాజెక్ట్ సకాలంలో పూర్తయ్యేలా అన్ని స్థాయిలలో పనిని పర్యవేక్షిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. ఈ పని ఈపీసీ మోడ్‌లో ఇవ్వబడింది. మొత్తం ప్రాజెక్ట్ ఫిబ్రవరి, 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఉన్న స్టేషన్ భవనానికి దక్షిణం వైపున కొత్త స్టేషన్ భవనం రాబోతోంది. జియోలాజికల్ సర్వే పూర్తయిన తర్వాత క్యాంపు కార్యాలయం, కాంక్రీట్ ల్యాబ్, స్టోరేజీ షెడ్ల ఏర్పాటు, మిగిలిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కొత్తగా నిర్మించనున్న స్టేషన్ భవనానికి 100 శాతం పునాదుల శంకుస్థాపన పూర్తయింది. ఇప్పటి వరకు, ఫౌండేషన్‌లు, బేస్‌మెంట్ ఫ్లోర్ యొక్క స్తంభాలు, రిటైనింగ్ వాల్‌లో సుమారు 7,450 క్యూబిక్ మీటర్ల కాంక్రీటును ఉపయోగించారు.
తదుపరి దశలో, బేస్‌మెంట్ ఫ్లోర్ కోసం కాంక్రీట్ స్లాబ్‌ను సెంట్రింగ్, షట్టరింగ్‌కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని, వేగంగా పురోగమిస్తున్నాయని ఎస్‌సీఆర్ తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు 20 శాతం పనులు పూర్తయ్యాయి. కొత్త స్టేషన్ బిల్డింగ్‌లో భాగంగా భారీగా నీటిని నిల్వచేసే సామర్థ్యంతో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ రానుంది. దీని కోసం, భూగర్భ ట్యాంకు నిర్మాణంతో పాటు దాని పునాదుల శంకుస్థాపన కోసం రెండు తవ్వకం పనులు కూడా పూర్తయ్యాయి.
అప్‌గ్రేడ్ చేసిన స్టేషన్‌లో భాగంగా ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ ప్యాసింజర్‌లను హ్యాండిల్ చేయడానికి రెండు కొత్త ఎయిర్‌కోర్సులను నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ ఎయిర్‌కోర్స్‌లు 35 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లను. స్టేషన్ భవనాలకు రెండు వైపులా (ఉత్తరం, దక్షిణం) కలుపుతాయి. తిరుపతి స్టేషన్ అప్‌గ్రేడేషన్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, దీంతో పనులకు ఆటంకం కలగకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని ఎస్‌సిఆర్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. స్టేషన్‌లో ప్రయాణికులకు, రైళ్ల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత జాగ్రత్తగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు.