ఇకపై పర్యావరణ అనుకూలమైన బ్యాగులలో తిరుమల లడ్డూ ప్రసాదం
ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావాన్ని తగ్గించేలా DRDO బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేసింది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Aug 2024 7:00 AM GMTఇకపై పర్యావరణ అనుకూలమైన బ్యాగులలో తిరుమల లడ్డూ ప్రసాదం
ప్లాస్టిక్ వ్యర్థాల పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేసింది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూలను పంపిణీ చేయడానికి బయోడిగ్రేడబుల్ బ్యాగ్‌లను ఉపయోగించాలని యోచిస్తోంది. ఇటీవలే తిరుమలలో ప్రత్యేక విక్రయ కౌంటర్‌ను డీఆర్‌డీవో చైర్మన్ సతీష్‌రెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఇప్పటివరకు, ఈ కొత్త ప్యాకేజింగ్ మెటీరియల్ 40కి పైగా పరిశ్రమలు ఉపయోగిస్తూ ఉన్నాయి.
ఆలోచన:
PBAT-ఆధారిత బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ ఆలోచనను డాక్టర్ కె. వీరబ్రహ్మం, అతని బృందం ప్రారంభించారు. PBAT ఉపయోగించి బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ అనేది పెట్రోలియం ఉత్పత్తులు, మొక్కల నూనెల నుండి తీసుకున్న పాలిమర్ ను ఉపయోగించి తయారు చేస్తారు. "సాంప్రదాయ పాలిథిలిన్ బ్యాగులు కిలోకు రూ. 140 ధర ఖర్చు అవుతూ ఉండగా.. ఈ బయోడిగ్రేడబుల్ బ్యాగ్ కు కిలోకు రూ. 160 నుండి 180 వరకు ఉత్పత్తి వ్యయం ఉంటుంది. ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ బయోడిగ్రేడబుల్ బ్యాగ్‌లను తక్కువ ఖర్చుతో ఉంచడానికి DRDO, దాని భాగస్వాములు కట్టుబడి ఉన్నారు" అని డాక్టర్ వీరబ్రహ్మం చెప్పారు. "సాంకేతికతను ఉచితంగా పంచుకోవడం, సహకారాన్ని పెంపొందించడం ద్వారా.. మేము ఉత్పత్తి, పంపిణీని సమర్ధవంతంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాము" అని ఆయన చెప్పారు.
పర్యావరణంపై ప్రభావం:
IS 17088 పరీక్షతో సహా పలు పర్యావరణ ప్రభావ అధ్యయనాలు, PBAT-ఆధారిత బయోడిగ్రేడబుల్ బ్యాగ్‌లు హానికరమైన అవశేషాలను వదలకుండా మూడు నెలల్లోనే కుళ్ళిపోతాయని, వాటిని కంపోస్టబుల్, పర్యావరణ అనుకూలమైనవిగా మారుస్తాయని తెలిపారు. PBAT-ఆధారిత బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ తో క్యారీ బ్యాగ్ లు మాత్రమే కాకుండా.. మెడికల్ వేస్ట్ బ్యాగ్‌లు, అప్రాన్‌లు, చెత్త బ్యాగ్‌లు, నర్సరీ బ్యాగ్‌లు, ష్రింక్ ఫిల్మ్‌లు, ప్యాకింగ్ ఫిల్మ్‌లను కూడా తయారు చేయొచ్చు.
ఈ సాంకేతికతకు పేటెంట్ ప్రోగ్రెస్‌లో ఉంది, ప్రమాదకర ప్లాస్టిక్‌కు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను కనుగొనడంలో DRDO నిబద్ధతతో పని చేస్తూ ఉంది. ఎకోలాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహకారం, బహుళ పరిశ్రమల ప్రమేయంతో ప్లాస్టిక్ కాలుష్యమనే మహమ్మారిని ఎదుర్కోవడానికి అవసరమైన సమిష్టి కృషికి ఈ క్యారీ బ్యాగ్ ఓ ఉదాహరణ.