తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం సమావేశం కానుంది. వై.వి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో చర్చించడానికి దాదాపు 55అంశాలతో కూడిన అజెండాను రూపొందిచారు. వీటిపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి దెబ్బతిన్న ఘాట్‌రోడ్ల మరమ్మతులపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రసాదాల తయారీలో ముడి సరుకుల కొనుగోళ్లకు ఆమోదం, తిరుమలలో సామాన్య భక్తులు బస చేసే కాటేజీల్లోని గదుల మరమ్మతులు జరుగుతున్న క్రమంలో గీజర్ల ఏర్పాటుపై చర్చించనున్నారు.
ఇక తిరుమలలోని సందీప్ రెస్టారెంట్ ను ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థకు మూడేళ్ల లీజ్ పొడిగింపు, తమిళనాడులోని ఉలందూరుపేటలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులకు ఆమోదం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. బంగారు ఆభరణాలను కరిగించి గోల్డ్ బార్స్ రూపంలోకి మార్చి బ్యాంకుల్లో డిపాజిట్ చేసే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2005 నుంచి పట్టు వస్త్రాలపై ప్రభుత్వం టీటీడీకి ఉన్న బకాయిలపై బోర్డు చర్చించనుంది. శ్రీవారిసేవ క్షౌరకులకు వేతనాల పెంపు ప్రతిపాదనపై కూడా చర్చించి.. నిర్ణయం తీసుకోనుంది.