భక్తులకు చేతికర్ర ఇచ్చి బాధ్యత నుంచి తప్పించుకోం: టీటీడీ చైర్మన్
భక్తుల భద్రతే తమకు ముఖ్యమని.. అందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు టీటీడీ చైర్మన్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 3:39 PM ISTభక్తులకు చేతికర్ర ఇచ్చి బాధ్యత నుంచి తప్పించుకోం: టీటీడీ చైర్మన్
తిరుమలలో వరుసగా చిరుత దాడులు జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. చిరుతలను పట్టుకునేందుకు బోన్లు ఇప్పటికే ఏర్పాటు చేశారు. వాటిని గమనించేందుకు సీసీ కెమెరాలను కూడా ఉంచారు. అంతేకాకుండా నడకమార్గంలో వెళ్లే భక్తుల భద్రత దృష్ట్యా కొన్ని ఆంక్షలను కూడా విధించారు అధికారులు. చిన్న పిల్లలకు పరిమిత సమయంలోనే తిరుమల నడకమార్గంలో అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఇక భక్తులకు చేతికర్రలు ఇస్తామని చెప్పారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కాగా.. చేతి కర్రలు ఇస్తామని చెప్పడంతో పలువురు ఆయనపై విమర్శలు చేశారు. చేతికర్రలు ఇచ్చి చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భక్తుల భద్రతపై స్పందించారు. భక్తుల భద్రతే తమకు ముఖ్యమని.. అందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆపరేషన్ చిరుత కొనసాగిస్తామని కూడా పరకటించారు. అయితే.. గురువారం తెల్లవారుజామున ఒక చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డితో కలిసి భూమన కరుణాకర్‌రెడ్డి పరిశీలించారు. అటవీశాఖ అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఆతర్వాత మీడియాతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ భూమన.. తిరుమల అటవీప్రాంతంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తామని తెలిపారు. రాత్రి 1.30 గంటల సమయంలో చిరుత బోనులో చిక్కిందని భూమన తెలిపారు. అయితే.. ఆ చిరుత మగ చిరుతగా అధికారులు నిర్ధారించరని అన్నారు.
భక్తులకు భద్రత ఏర్పాట్లు చేస్తూనే.. నడకమార్గంలో వచ్చే చిరుతలను బంధించే కార్యక్రమం కొనసాగిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. అటవీశాఖ అధికారుల ప్రతిపాదన మేరకే నడకదారిలో వచ్చే భక్తులకు చేతి కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. భక్తుల భద్రతలో భాగంగా అటవీశాఖ అధికారుల సూచన మేరకు అడవిలో 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని.. మరో 200 సీసీ కెమెరాలు కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. భక్తులకు చేతికర్రలు ఇచ్చి బాధ్యతల నుంచి తప్పించుకోమని.. పలువురు విమర్శలు చేయడం ఏమాత్రం సబబు కాదని టీటీడీ చైర్మన్ భూమన అన్నారు.