కోటి మంది విద్యార్థులకు భగవద్గీత పుస్తకాల పంపిణీ: టీటీడీ చైర్మన్
భగవద్గీతను విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో ముద్రించి కోటి మందికి పంపిణీ చేస్తామన్నారు టీటీడీ చైర్మన్.
By Srikanth Gundamalla Published on 28 Sep 2023 1:00 PM GMT కోటి మంది విద్యార్థులకు భగవద్గీత పుస్తకాల పంపిణీ: టీటీడీ చైర్మన్
తిరుపతి : సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడంలో భాగంగా భగవద్గీతను విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో రాయించి పుస్తకాలుగా ముద్రించి తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి పంపిణీ చేస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ప్రకటించారు. తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా భగవద్గీత ను ముద్రించి ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులకు అందించే ఆలోచన చేస్తామని తెలిపారు. చెన్నై స్థానిక సలహా మండలి చైర్మన్ గా ఎ జె శేఖర్ రెడ్డి సమాచార కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు.
కళ్యాణమస్తు, శ్రీవారి కళ్యాణోత్సవాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళతామని భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. హిందూ ధర్మ ప్రచారానికి తిరుమల దేవస్థానం నాయకత్వం వహిస్తే అందరూ అనుసరిస్తారనే నమ్మకం ఉందన్నారు. హిందూ ధర్మ ప్రచారానికి పునర్వైభవం తేవడానికి చిన్న పిల్లల్లో మానవీయ విలువలు, భక్తి విశ్వాసాలు పెంపొందించేందుకు తమ ధర్మకర్తల మండలి తొలి సమావేశంలోనే రామ కోటి తరహాలో గోవింద కోటి పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 25 సంవత్సరాల్లోపు వయస్సున్న వారు గోవింద కోటి రాస్తే వారితో పాటు కుటుంబ సభ్యులకు కూడా బ్రేక్ దర్శనం కల్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని కరుణాకర రెడ్డి తెలిపారు. ఇక భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. నడక దారిలో వచ్చే భక్తులకు భద్రత సిబ్బందిని రక్షణగా పంపడంతో పాటు, వారిలో ఆత్మ విశ్వాసం పెంచడానికి చేతి కర్ర ఇస్తున్నామని వివరించారు. ఈ నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో అనేక విమర్శలు చేసినా, భక్తులందరూ సంతోషంగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ నుండి అనుమతి లభిస్తే తిరుమల నడక దారి వెంబడి ఫెన్సింగ్ నిర్మించే ఏర్పాటు చేస్తామన్నారు టీటీడీ చైర్మన్. వేంకటేశ్వర స్వామి పట్ల అచంచల భక్తి విశ్వాసం, దానగుణం ఉన్న శేఖర్ రెడ్డిని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో ఎల్ఎసి చైర్మన్ గా నియమించామన్నారు.
చెన్నై స్థానిక సలహా మండలి చైర్మన్ ఏజే శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. చెన్నైలోని శ్రీవారి ఆలయం , పరిసరాలు ప్రస్తుతం 5.5 గ్రౌండ్ల స్థలంలో ఉన్నట్లు చెప్పారు. ఆలయాన్ని విస్తరించడానికి ఆలయాన్ని ఆనుకుని ఉన్న 3.5 గ్రౌండ్ల స్థలాన్ని కొనుగోలు చేశామని, మరో 1.5 గ్రౌండ్ల స్థలం కొనుగోలు చేయాల్సి ఉందని వివరించారు. మొత్తం 11 గ్రౌండ్ల స్థలంలో బ్రహ్మాండంగా శ్రీవారి ఆలయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. స్థలం కొనుగోలు కోసం ఇప్పటి వరకు రూ. 19 కోట్లు విరాళం వచ్చిందని ఏజే శేఖర్‌రెడ్డి తెలిపారు. మిగిలిన మొత్తం దాతల నుండి సమీకరించడానికి భూదానం పథకం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
రూ కోటి విరాళం:
చెన్నైలోని శ్రీవారి ఆలయ విస్తరణకు అవసరమైన భూమి కొనుగోలు కోసం ట్రూ వ్యాల్యూ హోమ్ సంస్థ తరపున వారి ప్రతినిధి రవిచంద్రన్ కోటి రూపాయల చెక్కును టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డికి అందజేశారు.