కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి దేశ, విదేశాల్లోంచి భక్తులు వస్తుంటారు. అలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త చెప్పింది. శ్రీవాణి టికెట్లకు సంబంధించి జూన్ నెల ఆన్‌లైన్ కోటాను నేడు విడుదల చేయనుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అంతేకాదు.. శ్రీవారి సేవకు సంబంధించిన పలు టికెట్లను విడుదల చేసే తేదీలను వెల్లడించింది.
మార్చి 23న శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు
మార్చి 23న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి. అదేవిధంగా.. జూన్ నెలకు సంబంధించిన మిగతా ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ మార్చి 24న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు నగదు చెల్లించి ఖరారు చేసుకోవాలి.
అంగప్రదక్షిణం టోకెన్లు
మార్చి 24న ఉదయం 10 గంటలకు జూన్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా
మార్చి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.