తిరుమల: ఇవాళ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం ఏప్రిల్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది.

By Srikanth Gundamalla  Published on  18 Jan 2024 8:15 AM IST
tirumala,  ttd, online tickets,

తిరుమల: ఇవాళ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

శ్రీవారి భక్తుల కోసం ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం ఏప్రిల్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది. సుప్రభాతం, తోఆల, అర్చన, అర్షటదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కోసం గురువారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. లక్కీడిప్‌ టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 22న మధ్యాహ్నం లోపు రుసుం చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు.

కాగా.. ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సమస్ర దీపాలంకార సేవా టికెట్లను టీటీడీ అధికారులు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్‌ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంచుతారు. శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు జరుగుతుంది. ఇక దీనికి సంబంధించిన సేవా టికెట్లను జనవరి 22 న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఈ నెల 23వ తేదీ దుయం 10 గంటలకుఅంగప్రదక్షిణం టోకెన్ల కోటా, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు. ఇక అదేరోజు మధ్యామ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను అందుబాటులో ఉంచుతారు.

జనవరి 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్‌కు వీలు కల్పించనుంది టీటీడీ. ఏప్రిల్‌కు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, ఒంటి గంటకు పరకామణి సేవా కోటాను విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరారు.

Next Story