తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు కొండపైకి వస్తుంటారు. శ్రీవారి భక్తులతో ఆలయం ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుంది. తాజాగా శ్రీవారి భక్తులను టీటీడీ గమనిక జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు 5 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే టీటీడీ శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేసింది. శ్రీవారి తెప్పోత్సవాల నేపథ్యంలో మార్చి 13, 14 తేదీల్లో వర్చువల్ ఆర్జిత సేవలనుచ మార్చి 15, 16, 17 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తిరుమల దేవస్థానం బోర్డు రద్దు చేసిందిఇ. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది.
తిరుమలలో తెప్పోత్సవాలు వందల సంవత్సరాల నుండి జరుగుతున్నాయి. తెప్పోత్సవాలను తెలుగులో 'తెప్ప తిరునాళ్లు', తమిళంలో 'తిరుపల్లి ఓడై తిరునాళ్' అంటారు. శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడమే తెప్పోత్సవం అంటారు. క్రీ.శ.1468లో శ్రీసాళువ నరసింహరాయులు పుష్కరిణి మధ్యలో 'నీరాళి మండపాన్ని' నిర్మించారు. దాన్ని తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. ఈ తెప్పోత్సవాలను తాళ్లపాక అన్నమయ్య ఎంతగానో కీర్తించారు. కోనేటిలో జరిగే ఈ తెప్పోత్సవాలు భక్తులను ఎంతగానో కనువిందు చేస్తాయి.