తిరుమల: ఇవాళ ఉ.10 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు
ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ.
By Srikanth Gundamalla Published on 23 Nov 2023 5:50 PM IST
రేపు ఉ.10 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు
తిరుమల వెళ్లాలనుకునే భక్తులు చాలా మంది ప్రత్యేక దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలనుకుంటుంటారు. ఈక్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక దర్శన కోటా టికెట్లు ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటించింది. అలాగే తిరుమల, తిరుపతి గదుల కోటాను నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు అధికారులు.
ఈ మేరకు భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో ముందస్తుగా దర్శన టికెట్లు, గదులను బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించారు.
శ్రీవారి సేవా టికెట్లు నవంబర్ 27న విడుదల
అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినానికి సంబంధించి శ్రీవారి సేవా స్లాట్లను కూడా విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ స్లాట్లను అందుబాటులో ఉంచనుంది టీటీడీ. 18 నుంచి 50 ఏళ్ల వరకు వయసు ఉన్నవారు మాత్రమే ఈ స్లాట్లను బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. ఇక తిరుపతి, తిరుమలలో భక్తులు స్వచ్ఛంద సేవ చేసేందుకు జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ కోటను ఈ నవంబర్ 27న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను టీటీడీ విడుదల చేయనునుంది. భక్తులు ఈ సేవల స్లాట్లను బుక్ చేసుకునేందుకు www.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించాలని టీటీడీ అధికారులు సూచించారు.