తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ.. నేరుగా క్యూలైన్లలోకి అనుమతి

తిరుమల కొండపై వీకెండ్‌లో భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. దర్శనం కోసం భక్తులను నేరుగా క్యూలైన్లలోకి అనుమతి ఇస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  2 Dec 2023 5:36 AM GMT
tirumala, pilgrims,  ttd,

 తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ.. నేరుగా క్యూలైన్లలోకి అనుమతి

తిరుమల వెళ్లే భక్తులకు ఇది గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. శ్రీవారి దర్శనం కోసం ఒక్కోసారి 24 గంటలు పైనే పడుతుంది. ప్రత్యేక దర్శన టికెట్లు ఉన్నవారికి కూడా అంత త్వరగా అయితే దర్శనం లభించదు. వేచి చూడాల్సింది. అలాంటిది ఇప్పుడు తిరుమల కొండపై వీకెండ్‌లో భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. ఇవాళ దర్శనం కోసం భక్తులను నేరుగా క్యూలైన్లలోకి అనుమతి ఇస్తున్నారు తిరుమల అధికారులు. తిరుమలలో శుక్రవారం 56,950 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 20,463 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు వచ్చాయి.

మరోవైపు టైమ్‌స్లాట్ టోకెన్లు ఉన్న భక్తులకు దర్శనం సకాలంలోనే జరుగుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులుకు 8 గంటల్లో దర్శనం దొరుకుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు గంట నుంచి 3 గంటల్లో దర్శనం పూర్తి అవుతోంది. కాగా.. తిరుమల శ్రీవారి వైంకుఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23 నంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంట ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. నవంబరు నెలలో 19.73 లక్షల మంది స్వామి వారి దర్శించుకున్నారని.. రూ.108.46 కోట్ల హుండీ ద్వారా భక్తులు స్వామి వారిని కానుకలు సమర్పించారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

కాగా.. వైకుంఠ ద్వార దర్శన సమయంలో దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఈవో తెలిపారు. డిసెంబరు 22 నుంచి 24 వరకు.. డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేశామన్నారు టీటీడీ ఈవో. ఈ సేవలను డిసెంబరు 25 నుంచి 30వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహిస్తారు. డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు సహస్రదీపాలంకార సేవను తిరుమల దేవస్థానం అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు.

Next Story