తిరుమల లడ్డు కల్తీ వివాదంపై టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వివాదం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 21 Sept 2024 7:00 PM ISTతిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వివాదం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ దైవం వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల అవశేషాల నుంచి తీసిన కొవ్వును వినియోగించినట్లు ఎన్‌డీడీబీ ఇటీవల నివేదిక ఇచ్చింది. దాంతో.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగానూ విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కల్తీ నెయ్యి శ్రీవారి ప్రసాదంలో వినియోగించారని కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తుంది.
ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం కీలక ప్రకటన చేసింది. స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అపచారం కారణంగా సంప్రోక్షణకు శ్రీకారం చుట్టింది. తిరుమలలో మూడు రోజుల పాటు మహా శాంతియాగం నిర్వహించాలని నిర్ణయించింది. శ్రీవారి ఆనంద నిలయంలో మహా శాంతియాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వహించనున్నారు. ఆ యాగంలో వేద పండితులతోపాటు రుత్వికులు పాల్గొనున్నారు.
మరోవైపు ఇదే క్రమంలో తెలంగాణ విజయ డెయిరీ కీలక ప్రకటన చేసింది. తాము స్వచ్ఛమైన ఆవు పాలు, నెయ్యి తదితర పాల ఉత్పత్తులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావుకు తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్ లేఖ రాశారు.