తిరుమల శ్రీవారి ఆలయంలో అపశృతి
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 6 July 2023 9:14 AM GMTతిరుమల శ్రీవారి ఆలయంలో అపశృతి
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. మహాద్వారం దగ్గర స్వామి వారి హుండీ కిందపడిపోయింది. ఆలయం నుంచి శ్రీవారి హుండీని పరామణి మండపానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. హుండీ కిందపడిపోవడంతో అందులోని కానుకలన్నీ బయట పడిపోయాయి. దీంతో.. ఆలయ సిబ్బంది వెంటనే స్పందించారు. కానుకలను మళ్లీ హుండీలో నింపారు. హుండీ కిందపడిపోవడంతో కాసేపు దర్శనాలను నిలుపుదల చేశారు. హుండీలో కానుకలన్నీ వేశాక జాగ్రత్తగా లారీలోకి ఎక్కించారు. అక్కడి నుంచి పరకామణికి హుండీని తరలించారు.
తిరుమల శ్రీవారి ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఆ క్రమంలోనే హుండీ ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. భక్తలు డబ్బులు, బంగారం ఇలా తమ మొక్కుకి అనువుగా కానుకలు సమర్పిస్తారు. వారు సమర్పించిన కానుకలతో హుండీ నిండాక ఆలయం వెలుపలకు తీసుకొచ్చి నూతన పరకామణికి తీసుకెళ్తారు ఆలయ సిబ్బంది. ఇలా పరకామణికి తీసకెళ్లే క్రమంలోనే హుండీ కిందపడిపోయింది. లారీలో ఎక్కిస్తుండగా ఈ సంఘటన జరిగింది. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే హుండీ కిందపడిపోయిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. శ్రీవారి హుండీని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. అలాంటిది హుండీ కింద పడిపోవడంతో భక్తులు అపశృతిగా భావిస్తున్నారు.