తిరుమ‌ల‌కు వెళ్లే శ్రీవారి భ‌క్తుల‌కు ఏపీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, ఇత‌ర రాష్ట్రాల నుంచి క‌లిపి మొత్తం దాదాపుగా 650 బ‌స్సు స‌ర్వీసుల‌ను తిరుప‌తికి న‌డుపుతోంది. బ‌స్సుల్లోనే తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శించుకునేందుకు వెళ్లేవారి కోసం శీఘ్ర‌ద‌ర్శ‌నం టిక్కెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్ర‌తిరోజూ 1000 టిక్కెట్లు అందుబాటులో ఉంచాల‌ని నిర్ణ‌యించింది. బ‌స్సు టిక్కెట్టుతో పాటు రూ.300 చెల్లిస్తే శీఘ్ర‌ద‌ర్శ‌నం టిక్క‌ట్టు కూడా బ‌స్సులోనే ఇస్తారు. ఉదయం 11 గంటల స్లాట్ లో, ఆపై సాయంత్రం 4 గంటల స్లాట్ లో టికెట్లను ఎంచుకోవచ్చున‌ని అధికారులు తెలిపారు.

ఈ టికెట్లు పొందిన వారికి త్వరితగతిన దర్శనం కల్పించేలా చూడడానికి తిరుమల బస్ స్టేషన్ లో ఆర్టీసీ సూపర్ వైజర్లను కూడా నియమించింది. కాగా.. బెంగళూరు, హైదరాబాద్, పాండిచ్చేరి, విశాఖపట్నం, చెన్నై, కంచి, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. నిన్న‌టి నుంచి ఈ విధానం అమ‌లులోకి వ‌చ్చింది. నిన్న‌టి రోజున 650 మంది భ‌క్తులు ఈ విధానం ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేశార‌ని అధికారులు తెలిపారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story