తిరుమల దర్శన టికెట్ల మోసాలపై కఠిన చర్యలు తీసుకుంటాం
తిరుమలలో పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
By Medi Samrat Published on 22 Dec 2024 7:07 PM ISTతిరుమలలో పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తిరుమల దర్శనాన్ని ప్రతి భక్తుడికి గుర్తుండేలా చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదాల నాణ్యతను మెరుగుపరిచామని, క్యూలైన్లలో భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించామని తెలిపారు. బ్రహ్మోత్సవాలు భారీ ఎత్తున నిర్వహించామని, తిరుమలలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 2047 తిరుమల విజన్‌లో భాగంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, దాతలు నిర్మించే అతిథి గృహాల్లో 20 గృహాలకు ఆధ్యాత్మిక నామకరణం చేస్తామని తెలిపారు. తిరుమలలో అలిపిరి వాకింగ్ పాత్‌లో సౌకర్యాలు, పార్కింగ్ సౌకర్యాలు కూడా పెంచుతున్నట్లు వివరించారు.
అన్యమతస్తుల బదిలీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, తిరుమలలో అనధికార దుకాణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లడ్డూ ప్రసాదానికి స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నామని, దేశవ్యాప్తంగా టీటీడీకి అనుబంధంగా 61 ఆలయాలు ఉన్నాయని, ఈ ఆలయాలకు కన్సల్టెన్సీ ద్వారా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు. పద్మావతి అమ్మవారి ఆలయంలో పార్కింగ్ సమస్యలు ఉన్నాయని తెలిపారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగంలో కూడా లోపాలున్నాయని, అయితే ఈ సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా టీటీడీ విజిలెన్స్ అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, దర్శన టిక్కెట్లు ఇప్పిస్తానని భక్తులను మోసం చేస్తున్న వ్యక్తులను పట్టుకుంటున్నారని శ్యామలరావు తెలిపారు.