కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. శనివారం ఉదయం 9 గంటలకు స్వరదర్శనం టికెట్లను విడుదల చేయగా.. కేవలం 35 నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకు గల టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. రోజుకు 8 వేల చొప్పున మొత్తం 35 రోజుల టికెట్లు(2.88 లక్షల టికెట్లు)ను అందుబాటులో ఉంచగా.. కేవలం అరగంట వ్యవధిలో భక్తులు వీటిని బుక్ చేసుకున్నారు.
గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని టికెట్ల బుకింగ్ కు ఉన్న విపరీతమైన డిమాండ్ దృష్ట్యా.. వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్ల కేటాయింపు చేశారు. వర్చువల్ క్యూ ద్వారా ముందుగా వెబ్ సైట్ లో లాగిన్ అయిన వారికి అవకాశం కల్పించారు. వర్చువల్ క్యూ పద్ధతి పాటించడంతో సర్వర్ల క్రాష్ సమస్య ఎదురుకాలేదు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు టికెట్లు బుక్ చేసుకున్నారు. కాగా.. టికెట్లు పొందిన భక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా 72 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకుని, నెగిటివ్ సర్టిఫికెట్‌తో తిరుమలకు రావాలని అధికారులు సూచించిన సంగతి తెలిసిందే.