కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో హుండీలో కాసుల వర్షం కురిసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆదివారం ఒక్క రోజు రూ.6.18 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. 2012 ఏప్రిల్ 1వ తేదీన రూ.5.73 కోట్ల ఆదాయం రావడమే ఇప్పటి వరకు అత్యధికం. కరోనా తరువాత ఈ సంవత్సరం నుంచి సర్వదర్శనానికి భక్తులందరికీ అవకాశం కల్పించడంతో గత రెండేళ్లుగా తిరుమలకు రాలేని భక్తులు స్వామిని దర్శించుకునేందుకు పోటెతుతున్నారు. భారీగా హుండీ కానుకలు సమర్పించుకుంటుండడంతో ఆదాయం పెరిగి కొత్త రికార్డును సృష్టించింది.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల కొండపై సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. ఆదివారం అర్ధరాత్రి వరకు 88,682 మంది స్వామిని దర్శించుకున్నారు. 37,447 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.9 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్టు లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. ప్రస్తుతం దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్‌లు నిండాయి.