స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు.. తిరుపతి ప్రజలకు బాగా సుపరిచితమైన పేరు. ఎక్కడైనా పాము కనిపిస్తే చాలు ఒక్క ఫోన్ చేస్తే పది నిమిషాల్లో అక్కడకు వచ్చి పామును పట్టుకుంటాడు. కొన్ని వేల పాములను పట్టుకుని వాటిని అడవుల్లో విడిచిపెట్టి వాటికి ప్రాణం పోశాడు. అయితే.. పాము కాటుకు గురైన అతను ఆరు రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.
టీటీడీ ఉద్యోగిగా పని చేస్తూ ఇప్పటి వరకు 10వేలకు పైగా పాములను పట్టుకుని వాటిని సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టాడు. అయితే రోజులు ఒకేలా ఉండవు గదా.. వారం రోజుల క్రితం ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో ఓ పామును పడుతుండగా దురదృష్టవశాత్తు గ్లౌజ్ ఊడిపోయింది. పాము కాటువేసింది. వెంటనే ఆయన్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాము కాటుతో పాటు డెంగ్యూ కూడా సోకడంతో భాస్కర్ నాయుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.
ప్లేట్ లెట్స్ సంఖ్య కూడా పడిపోయింది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై భాస్కర్ నాయుడికి చికిత్స అందిస్తున్నారు. భాస్కర్ నాయుడు ఆరోగ్య పరిస్థతిపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే టీటీడీ ఉద్యోగిగా రిటైరైనప్పటికీ అధికారులు భాస్కర్ నాయుడు సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.