తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం ఉదయం స్వామివారికి సింహవాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీ మలయప్పస్వామి సింహ వాహనంపై యోగనరసింహుడిగా మాఢవీధుల్లో ఉరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జగన్నాయకుడి అవతారాల్లో నాలుగోది నృసింహ అవతారం.
దుష్టశిక్షణ, శిష్టరక్షణ కు సింహ వాహనం ప్రతీతి. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.
శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. ఆరు కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 64,823 మంది భక్తులు దర్శించుకోగా 22,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.03 కోట్లు వచ్చింది.