తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Koil Alwar Tirumanjanam held at Tirumala Temple. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ ఉదయం ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు.
By అంజి Published on 12 July 2022 1:34 PM ISTతిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ ఉదయం ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఈ నెల 17న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమంజనం నిర్వహించారు. తిరుమంజనం తర్వాత ఆగమోక్తంగా స్వామివారి మూల విరాట్‌లకు పూజాదికాలు చేపట్టారు. ప్రతి ఏడాది వచ్చే ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశికి ముందు మంగళవారం రోజున ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ తిరుమంజనంలో భాగంగా ఆలయంలోని బంగారువాకిలి మొదలుకొని ఆనందనిలయం వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజ సామాగ్రితో పాటు అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు.
తిరుమంజనం సమయంలో స్వామి వారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి పూర్తైన తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర వాటితో తయారుచేసిన పరిమళ లేపనంతో ఆలయగోడలకు సంప్రోక్షణ చేపట్టారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా ఒక మహా యజ్ఞంలా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ''ఈ నెల 17న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా వచ్చిన మంగళవారం రోజున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించాం'' అని తెలిపారు.