అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్ అరెస్ట్

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మొహమ్మద్ ముజామిల్ ను ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అరెస్టు చేసింది.

By -  Medi Samrat
Published on : 31 Jan 2026 9:10 PM IST

అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్ అరెస్ట్

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మొహమ్మద్ ముజామిల్ ను ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అరెస్టు చేసింది. ఈ కింగ్ పిన్ ఎర్రచందనం దుంగలను లైసెన్స్ పేరు చెప్పి అక్రమంగా చైనాకి తరలించేవాడు. శేషాచలం నుంచి బెంగళూరు మీదుగా రవాణాకు పాల్పడేవాడు. ముజామిల్ మీద కేసులు ఉండగా, 87 శాతం కేసుల్లో శిక్షలు కూడా ఖరారయ్యాయి. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే.. ఎర్ర చందనం స్మగ్లర్లు.. వారి వెనక ఉన్నవారిపై ఉక్కు పాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ బృందం కింగ్ పిన్స్ వేట మొదలుపెట్టింది.

ఈ వేటలో భాగంగా శనివారం ఉదయం చిత్తూరు - నాయుడుపేట జాతీయ రహదారిపై అడిషనల్ ఎస్పీ కులశేఖర్ ఆధ్వర్యంలోని బృందం ముజామిల్ ను పట్టుకుంది. ఇతనికి చైనాలోని జైమెన్ టాంగాంగ్ ఫాంగ్ ట్రేడ్ కంపెనీతో సంబంధాలు ఉన్నట్టు విచారణలో తేలింది. ఎర్రచందనం అక్రమ రవాణాకి పాల్పడే వారి పట్ల ప్రభుత్వం నిర్ధయగా వ్యవహరిస్తుందని, కింగ్ పిన్స్ ఎవరైనా ఉంటే లొంగిపోవాలని గత చిత్తూరు జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కింగ్ పిన్స్ ఏ మూలన దాగి ఉన్నా పట్టుకుంటామని నాడు చెప్పారు. అప్పటి నుంచి ఓ ప్రత్యేక ఆపరేషన్ మొదలుపెట్టి యాంటి రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ బృందం గాలింపు మొదలుపెట్టి మొదటి విజయం సాధించింది. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న పవన్ కళ్యాణ్ లక్ష్య సాధనలో ఇది కీలక అడుగుగా చెప్పుకోవచ్చు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న, సహకరించిన టాస్క్ ఫోర్స్ హెడ్ ఎస్పీ సుబ్బారాయడు, అడిషనల్ కులశేఖర్, ఇతర సిబ్బందిని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభినందించారు.

Next Story