ఇటీవలే తిరుపతి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. దీంతో కాలనీలు అన్ని వరదతో పాటు బురదమయంగా మారాయి. వరద నీరు రెండు, మూడు రోజులు నిలవడంతో స్థానికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక శ్రీకృష్ణనగర్‌లోని ప్రజలు గత రెండు రోజులుగా భయంతో వణికిపోతున్నారు. రెండు రోజుల క్రితం ఆ కాలనీలో ఓ ఇంటి ముందు ఉన్నవాటర్ ట్యాంకు భూమిలోంచి బయటకు రాగా.. తాజాగా నేలపై ఉన్న ఇళ్లు రెండు, మూడు అడుగుల లోతుకు కుంగుతున్నాయి. దీంతో కాలనీ వాసులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం భయంగా బ్రతుకుతున్నారు.
గురువారం శ్రీకృష్ణ నగర్‌లోని ఓ ఇంటి ముందు ఉన్న వాటర్ ట్యాంకును శుభ్రపరుస్తుండగా.. హఠాత్తుగా ఆ ట్యాంకు 18 సిమెంట్ రింగులు భూమిలోంచి బయటకు వచ్చాయి. వరద నీరు నిలవడంతో ట్యాంకు పైకి వచ్చిందని అనుకుంటుంటుండగా.. ఇప్పుడు పలు ఇళ్లు భూమిలోకి కుంగుతున్నాయి. 18 ఇళ్ల గోడలకు ఏకంగా పగుళ్లు(బీటలు) ఏర్పడ్డాయి. దీంతో కృష్ణనగర్‌లో ఉండాలంటే భయంగా ఉందని.. ఎప్పుడు ఇళ్లు కూలిపోతాయో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు.