తిరుపతి గరుడ వారధి పనుల్లో అపశృతి
Garuda Varadhi collapsed at Tirupathi.తిరుపతి గరుడ వారధి పనుల్లో అపశృతి చోటుచేసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 25 Jan 2021 2:59 PM GMTతిరుపతి గరుడ వారధి పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి అలిపిరి వెళ్లే మార్గంలోని శ్రీనివాసం భక్తుల వసతి గృహం సముదాయం వద్ద గరుడ వారధి డౌన్‌ర్యాంప్‌పై ఏర్పాటు చేసిన సిమెంటు సెగ్మెంట్లు కిందకి జారిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దిమ్మెలతో పాటు యంత్రాలు కూడా పడిపోయాయి. పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే.. ఈ ఘటనలో ఎవరీకి గాయాలు కాకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. క్రేన్ సాయంతో దిమ్మెలను ఎక్కిస్తున్న సమయంలో సమన్వయ లోపం కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
జారిపోయిన సెగ్మెంట్లు శ్రీనివాసం వసతి గృహ ప్రహరీపై పడటంతో పెద్ద శబ్దం వచ్చింది. ఆ సమయంలో కింద కార్మికులు ఎవరూ లేకపోవడంతో.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీష, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అర్భన్ జిల్లా ఎస్సీ రమేష్ రెడ్డి అక్కడికి చేరుకుని ఘటనకు గల కారణాలను గుత్తేదారు సంస్థ ఆఫ్కాన్ ప్రతినిధులను అడిగితెలుసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరపనున్నట్లు వారు తెలిపారు.
రూ.684 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గరుడ వారధిని నిర్మిస్తోంది. ఇందులో టీటీడీ వాటా రూ.450 కోట్లు కాగా.. మిగిలిన మొత్తం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఖర్చు చేస్తోంది. స్మార్ట్ సిటీ ఫేజ్-1 పనుల్లో భాగంగా ఈ నిధులు ఖర్చు చేస్తోంది. 2018 ఫిబ్రవరిలో ప్రారంభమైన గరుడ వారధి ఫ్లై ఓవర్ ను రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.