తిరుపతిలో అందుబాటులోకి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్ బస్సు

ఏపీలో మొదటిసారిగా తిరుపతి డబుల్‌ డెక్కర్‌ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

By Srikanth Gundamalla  Published on  15 Sept 2023 1:31 PM IST
double decker, electric bus, tirupati,

తిరుపతిలో అందుబాటులోకి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్ బస్సు

ఏపీలో మొదటిసారిగా తిరుపతి డబుల్‌ డెక్కర్‌ ఎలక్ట్రి ఏసీ బస్సు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వచ్చే మంగళవారం సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఈ బస్సును ప్రారంభించనున్నారు.

తిరుపతి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. తిరుమలకు వెళ్లే భక్తులతో నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది తిరుపతి. రోజుకు 70వేల నుంచి 80వేల మంది తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తుంటారు. కొందరు తిరుపతికి ఆస్పత్రులు, విద్య కోసం ప్రయాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలో తిరుపతి నుంచి పలు ప్రాంతాలకు బ్యాటరీ బస్సులు ఉన్నాయి. మరో అద్భుత సర్వీస్‌ను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తిరుపతి నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ చొరవతో తిరుపతి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్ బస్సు అందుబాటులోకి తెస్తున్నారు.

అశోక్‌ లేలాండ్‌ అండ్‌ స్విచ్‌ కంపెనీ ఈ బస్సును తయారు చేసింది. ఎలక్ట్రిక్‌ డబుల్ డెక్కర్ ఏసీ బస్సును రూ.2 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేశారు. ఒకసారి చార్జ్‌ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా ఈ బస్సును సిద్ధం చేశారు. ఇందులో ఒకేసారి 65 మంది ప్రయాణికులు వెళ్లవచ్చు. అయితే ఒక బస్సును తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కు తీసుకొచ్చారు అధికారులు. దీనికి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బస్సులో సౌకర్యాలను పరిశీలించారు. వచ్చే మంగళవారం తిరుపతి పర్యటనకు రానున్న సీఎం జగన్ చేతులమీదుగా ఈ బస్సును ప్రారంభించనున్నారు.

గతంలో తిరుపతి రోడ్లపై ఆటోలు కూడా తిరిగే పరిస్థితి లేకుండా ఇరుకుగా ఉండేవని అధికారులు అంటున్నారు. ఇప్పుడు ఏకంగా డబుల్‌ డెక్కర్‌ బస్సే ప్రయోగాత్మకంగా తిరగలిగిందని భూమన అభినయ్‌ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీఇవారు, శ్రీవారి చెల్లెలు గంగమ్మ తల్లి ఆశీస్సులతో తిరుపతి అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. భారత దేశంలో హైదరాబాద్‌ తర్వాత డబుల్‌ డెక్కర్‌ బస్సు కలిగిన మరో ఏకైక నగరంగా తిరుపతి రికార్డుకెక్కుతుందని భూమన అభినయ్ రెడ్డి చెప్పారు. ప్రజా స్పందన ఆధారంగా,భవిష్యత్తులో అవసరాలను బట్టి మరికొన్ని డబుల్ బస్సులను తీసుకొచ్చే అంశాన్ని నగర పాలక సంస్థ పరిశీలిస్తుందని పేర్కొన్నారు.

Next Story