Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ప్రారంభం కానుంది.
By అంజి Published on 16 Dec 2024 12:10 PM ISTఅమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ప్రారంభం కానుంది. నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం అవడంతో తిరుమలలో రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను రద్దు చేశారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పాశురాలతో శ్రీవారికి మేలుకొలుపు చేయనున్నట్టు పేర్కొన్నారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చాన, శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను స్వామి వారికి అలంకరించనున్నారు. నైవేద్యంగా బెల్లం దోశ, సిరా, పొంగల్ నివేదించనున్నారు.
ఇవాళ ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు స్వామివారికి తిరుప్పావైతో మేల్కొలుపు ఉంటుంది. అలాగే ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. తిరుమలలో ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఇదిలా ఉంటే.. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లు వచ్చింది. అలాగే సోమవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి ఆలయం సుప్రభాత సేవ రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.