ఇకపై ప్రతి భక్తుడికీ ఉచితంగా ఒక 'తిరుపతి లడ్డు'

By Newsmeter.Network  Published on  1 Jan 2020 6:28 AM GMT
ఇకపై ప్రతి భక్తుడికీ ఉచితంగా ఒక తిరుపతి లడ్డు

కొత్త సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు బ్రహ్మాండమైన గిఫ్టునిచ్చింది. బ్రహ్మాండనాయకుడి బహుమతి అంటే తిరుపతి లడ్డూయే. అందుకనే దర్శనం చేసుకునే ప్రతి భక్తుడికీ లడ్డూ ప్రసాదం ఇవ్వాలని తితిదే నిర్ణయించింది. ఈ పథకం జనవరి 6 వైకుంఠ ఏకాదశి నాడు ప్రారంభమౌతుంది.

తిరుపతి లడ్డూ విషయంలో భక్తులకు ఎనలేని శ్రద్ధాసక్తులు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద లడ్డూ, చిన్న లడ్డూ, ప్రసాదం లడ్డూ – ఇలా మూడు రకాల లడ్డూలు తయారు చేయడం జరుగుతుంది. ఏడు వందల గ్రాముల పెద్దలడ్డూలు మూడు వేలు తయారవుతాయి. ఇవి ఆర్జిత సేవలలో పాల్గొన్న వారికి ఇవ్వడం జరుగుతుంది. మిగతావి రికమండేషన్ లెటర్లతో వచ్చిన వీఐపీలకు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని రూ. 200 కి ఒకటి చొప్పున అమ్మడం జరుగుతుంది.

175 గ్రాముల బరువుండే చిన్న లడ్డూలకు బాగా డిమాండ్ ఉంటుంది. ప్రతి రోజూ 3.75 వేల లడ్డూలు తయారవుతాయి. మామూలుగా భక్తులు తెచ్చుకునే లడ్డూలు ఇవే. వివిధ పథకాల్లో ఈ లడ్డులను ఒకటి లేదా రెండు చొప్పున ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సర్వదర్శనం చేసుకునేవారికి పది రూపాయలకు ఒక లడ్డూ ఇవ్వడం జరుగుతుంది. అదనంగా లడ్డూలు కావాలంటే రూ. 25 చెల్లించాల్సి ఉంటుంది. స్పెషల్ దర్శనం చేసుకునేవారికి రెండు లడ్డూలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ కౌంటర్లలో లడ్డూలు యాభై రూపాయల చొప్పున అమ్మడం జరుగుతుంది.

ఈ లడ్డూలన్నీ సబ్సిడీపైనే అమ్మడం జరుగుతుంది. కాబట్టి తితిదేకి ప్రతి ఏటా లడ్డూలపై దాదాపు రూ. 250 కోట్ల మేరకు నష్టం వాటిల్లుతుంది. అంతే కాక వివిధ స్థాయిల్లో బ్లాక్ మార్కెటింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అందుకే తితిదే ఇప్పుడు ఈ అవకతవకలు, నష్టాలన్నిటినీ నిర్మూలించేందుకు ప్రక్రియలను సరళీకరిస్తోంది. జనవరి 6 నుంచి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డూ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాక అదనంగా కావాలనుకున్న వారు రూ. 50 చెల్లించి లడ్డూలు పొందవచ్చు.

Next Story