తిరుమంగాయ్ ఆళ్వార్.. భారత్ కే సొంతం
By రాణి Published on 25 Feb 2020 6:38 AM GMTభారత దేశానికి చెందిన ఓ విగ్రహాన్ని అప్పగించాలని కోరుతూ ఆక్స్ఫర్డ్ లోని అష్మోలీన్ మ్యూజియంను భారత ప్రభుత్వం కోరింది. 15వ శతాబ్దానికి చెందిన కాంస్య విగ్రహాన్ని 1960లలో భారత్ నుండి చోరీ చేశారు. లండన్ లోని ఇండియన్ హై కమీషన్ 'తిరుమంగాయ్ ఆళ్వార్' కు చెందిన ఆ విగ్రహాన్ని తమకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 1967 లో లండన్ లోని సోత్బై లో జరిగిన వేలంపాటలో అష్మోలీన్ మ్యూజియం ఈ కాంస్య విగ్రహాన్ని సొంతం చేసుకుందని గత డిసెంబర్ లో తెలిసింది.
ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాండిచ్చేరిలో 1957 సంవత్సరానికి సంబంధించిన ఓ ఫోటో గ్రాఫ్ బయటకు వచ్చింది. ఆ ఫోటో గ్రాఫ్ లో ఉన్నది తమిళనాడు రాష్ట్రం, కుంభకోణం దగ్గర ఉన్నటువంటి ఓ గ్రామంలో ఉన్న శ్రీ సౌందరరాజపెరుమాళ్ ఆలయంలోనిది ఈ విగ్రహం అని తేలింది. ఈ విగ్రహం దాదాపు ఒక మీటరు ఎత్తు ఉంది. ఆ విగ్రహం చేతిలో ఓ కత్తి, డాలు ఉన్నాయి. తిరుమంగాయ్ ఆళ్వార్ కు తమిళ వైష్ణవ సంస్కృతిలో ప్రత్యేకమైన చరిత్ర కలదు. ఆయన 8-9 శతాబ్దాల మధ్య కాలంలో నివసించారు. ఆయన కవి కాకముందు సైన్యంలోనూ పని చేశారు, అలాగే బందిపోటుగా కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన జీవితంలో వచ్చిన మార్పుల కారణంగా వైష్ణవాన్ని వ్యాప్తి చేసేందుకు కవిగా మారాడు.
ఈ విగ్రహం తమకు చెందినదేనని లండన్ లోని భారత హై కమిషన్ చెప్పుకొచ్చింది. హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ రాహుల్ నంగారే మాట్లాడుతూ తమినాడు పోలీసుల నుండి తమకు రిపోర్ట్ అందిందని.. ఒరిజినల్ విగ్రహాన్ని ఆలయంలో నుండి దొంగిలించారని.. ఆ విగ్రహం స్థానంలో నకిలీ విగ్రహాన్ని ఉంచారని.. అసలైన విగ్రహం అష్మోలీన్ మ్యూజియంలో ఉంచారని ఆ రిపోర్టులో ఉంది. అష్మోలీన్ మ్యూజియం భారత హైకమీషన్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విగ్రహాన్ని దొంగిలించింది ఎవరు..? దాన్ని వేలంపాటలోకి తీసుకొని వచ్చింది ఎవరు అన్నదానిపై కూడా విచారణ జరుగుతోంది. ఈ విగ్రహం భారత్ కు చెందినదేనని భావించిన అష్మోలీన్ మ్యూజియం సభ్యులు భారత హైకమిషన్ కు సమాచారం అందించడం విశేషం. ఇలాగే మిగిలిన మ్యూజియం సిబ్బంది కూడా చర్యలు తీసుకుంటే భారత చారిత్రాత్మక సంపాదనను కాపాడవచ్చని రాహుల్ చెప్పుకొచ్చారు. మ్యూజియం సభ్యులు త్వరలో భారత్ కు రానున్నారని.. ఆ విగ్రహం భారత్ కు చెందినదేనని వాళ్ళు భావిస్తే తిరిగి ఇచ్చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. Dr.జెఆర్ బెల్మోంట్ (1886-1981) కలెక్షన్ ను వేలం వేయగా అందులో ఈ విగ్రహం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ విగ్రహమే కాకుండా పలు దేశాలలోని మ్యూజియంలలో భారత్ కు చెందిన కాంస్య విగ్రహాలు ఉన్నాయి.. అవి అక్రమంగా అక్కడికి తరలించబడ్డాయా అన్నది తెలియాల్సి ఉంది.