Fact Check: జూన్ 30 వరకు తిరుమల ఆలయం మూసివేస్తున్నారా ?.. సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ నిజమేనా ?
By సుభాష్ Published on 28 April 2020 12:25 PM GMT
సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ నిజమేనా ?
దేశమంతటా లాక్‌డౌన్ కొనసాగుతోంది. జనం ఇళ్లనుంచి బయటకు వెళ్లడం లేదు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆలయాలు కూడా మూతపడ్డాయి. కేవలం నిత్య పూజలు, నైవేద్యం సేవలు మాత్రమే పూజారులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. కలియుగ వైకుంఠం తిరుమలలో కూడా అదే పరిస్థితి. భక్తులకు ఏమాత్రం ప్రవేశం లేదు. ఆలయ వేద పండితులు నిత్య పూజలు, కైంకర్యాలు మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. మార్చి 22వ తేదీన జనతాకర్ఫ్యూ, ఆ మరుసటిరోజున లాక్‌డౌన్ మొదలైనప్పటినుంచీ ఇదే పరిస్థితి. తొలుత మార్చి నెలాఖరు వరకే లాక్‌డౌన్ అనుకున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ గడువును పొడిగించిన తర్వాత ఆలయాల్లో ప్రవేశాలపై కూడా నియంత్రణను పొడిగించారు.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌పై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికైతే మే 3వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంటుందన్నది మాత్రం స్పష్టం. కానీ, ఈ లాక్‌డౌన్‌ను మళ్లీ పొడిగిస్తారా ? లేదంటే ఎత్తేస్తారా ? అన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. తిరుమల ఆలయంలోకి జూన్ 30 దాకా దర్శనాలకు భక్తులను అనుమతించబోరన్నది ఆ పోస్ట్ సారాంశం. వాట్సప్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఈ ప్రచారం జరుగుతోంది.
అయితే.. ఈ వైరల్ అయిన పోస్టుపై టీటీడీ స్పందించింది. జూన్ 30 దాకా భక్తులకు దర్శనం నిలిపేస్తారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, అధికారికంగా అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని టీటీడీ ప్రకటన వెలువరించింది. భక్తులు ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మవద్దని సూచించింది.
సో.. తిరుమల ఆలయంలోకి జూన్ 30 దాకా భక్తులకు అనుమతించబోరంటూ జరుగుతున్న ప్రచారంపై టీటీడీ ప్రకటనతో స్పష్టత వచ్చింది. భక్తుల్లో నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది.
ప్రచారం : తిరుమల ఆలయంలోకి జూన్ 30వ తేదీ వరకూ భక్తులను దర్శనానికి అనుమతించరు.
వాస్తవం : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని అధికారికంగా ప్రకటించింది.
కంక్లూజన్ : కరోనా వేళ వెల్లువెత్తుతున్న తప్పుడు వార్తల్లో కలియుగ వైకుంఠం తిరుమల ఆలయంపైనా తప్పుడు వార్త బయటపడింది. కాబట్టి ఏ ప్రచారమైనా గుడ్డిగా నమ్మవద్దు.