కళకళలాడుతున్న తిరుమల కొండ
By న్యూస్‌మీటర్ తెలుగు
తిరుమల : టీటీడీ చేసిన విద్యుత్ అలంకరణల ఏర్పాట్లతో తిరుమల క్షేత్రం కళకళలాడుతోంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో విద్యుత్ వెలుగులతో తిరుమల కొండపై కాంతులు విరజిమ్ముతున్నాయి. జీఎన్‌సీ టోల్ గేట్ నుంచి మాడ వీధుల వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగులతో కొండ కళకళాడుతోంది. ఆలయ మహాగోపురంతో పాటు ప్రాకారం, ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేస్తున్నారు.
అలాగే వివిధ ప్రాంతాల్లో దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. పార్క్‌లు, వాటర్ ఫౌంటెన్లు విద్యుత్ కాంతుల్లో ప్రత్యేక అందాలు సంతరించుకున్నాయి.ప్రధాన కూడళ్ళలో భారీ కటౌట్లు, సప్తద్వారాలు, రోడ్లకు ఇరువైపుల ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు.
సంబంధిత సిబ్బంది అలంకరణల నాణ్యతను గత మూడు రోజులుగా పరిశీలిస్తున్నారు. గుర్తించిన లోటుపాట్లను సవరిస్తున్నారు. వచ్చే రెండు రోజుల్లో ఆలయ ప్రాకారం, గోపురం, లోపలి భాగాల్లోని విద్యుత్ అలంకరణ పనులు కూడా పూర్తిచేయనున్నారు.