అమ్మాయిలకు ముఖ సౌందర్యం ఎంత అవసరమో..పెదాలను పదిలంగా చూసుకోవడం కూడా అంతే అవసరం. శరీరంలో వేడి పెరిగినప్పుడు, చలి ఎక్కువగా ఉన్నప్పుడు పెదాలు పగిలిపోతుంటాయి. వాటిని కాపాడుకోవడానికి రకరకాల లిప్ బామ్ లు, లిప్ స్టిక్ లు వాడుతుంటారు చాలా మంది. అలాగే చాలా మందికి పుట్టుకతోనే పెదాలు నల్లగా ఉంటాయి. మరికొంత మందికి లేతగులాబీ రంగులో ఉంటాయి.

శరీరంలో తేమ శాతం తక్కువగా ఉన్నా, సిగరెట్, చుట్ట వంటివి తాగడం వల్ల, ఎండకు, హార్మోన్ల లో తేడా, కాఫీ ఎక్కువగా తాగడం వల్ల, కొన్ని మెడిసిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పెదాలు నల్లగా అవుతుంటాయి. ఇలా పెదాలు నల్లగా ఉండటం వల్ల నలుగురిలో తిరిగేందుకు మీరు ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఇప్పుడు చెప్పే 10 చిట్కాలలో మీరు ఏదొకటి ట్రై చేసి చూడండి. మీ పెదాలు గులాబీ రంగులోకి మారడం ఖాయం.

10 చిట్కాలు

1.తేనెలోని తియ్యదనం పెదాలను మృదువుగా చేస్తుంది. అలాగే నిమ్మరసం లోని సిట్రిక్ యాసిడ్ పెదాలు లేత రంగులోకి వచ్చేందుకు సహాయపడుతుంది. ఇలా తేనె, నిమ్మరసాన్ని సమంగా తీసుకుని పెదాలకు రాసి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత నీటితో కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేస్తే అందమైన పెదాలు మీ సొంతమవుతాయి.

2. పెదాల కోసం వాడే లిప్ స్టిక్, లిప్ కేర్ లలో బాదం నూనె (almond oil) ఉంటుందని మీకు తెలుసా ? ఇది పెదాలు మృదువుగా ఉండటంలో తోడ్పడుతుంది. రాత్రి పడుకునేటపుడు బాదంనూనెలో నిమ్మరసం కలిపి పెదాలకు రాసుకోవాలి. ఉదయాన్నే లేచాక పెదాలను నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా పెదాలను మృదువుగా, అందంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.

3.సాధారణంగా బీట్ రూట్ తింటే శరీరంలో రక్తపు శాతం పెరుగుతుందని మన పెద్దలు, డాక్టర్లు చెప్తుంటారు. అదే బీట్ రూట్ మగువ ముఖంలోని పెదాలను అందంగా తీర్చిదిద్దడంలో కూడా సహాయపడుతుంది. బీట్ రూట్ రసం, తేనె సమంగా తీసుకుని..ఆ మిశ్రమాన్ని దూదితో పెదాలకు రాసుకోవాలి.

4.బేకింగ్ సోడా..ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండే వస్తువిది. ఇది కేవలం మన శరీరంపై ఉన్న మృతకణాలను తొలగించడంలోనే కాకుండా..పెదాలను అందంగా తీర్చిదిద్దడంలో సహాయ పడుతుంది. నీటిలో బేకింగ్ సోడా వేసి పేస్ట్ లా అయ్యేంత వరకూ కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు పట్టించి..మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. పెదాలను నీటితో శుభ్రం చేశాక రెండు చుక్కలు బాదం నూనెను రాయాలి. ఇలా కొద్దిరోజుల చేయడం వల్ల పెదాలు లేత గులాబీ రంగులోకి మారుతాయి.

5.కీర దోసకాయ. కళ్ల కింద ఉండే నల్లటి వలయాల్ని తొలగించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కీర పీల్ ను తీసి, ముక్కలుగా కట్ చేసుకుని రసం తీసుకోవాలి. ఈ రసంలో కొద్దిగా పాలు, పసుపు వేసి మెత్తటి పేస్ట్ లా చేసుకోని పెదాలకు రాయాలి. అది ఆరిపోయాక కొబ్బరి నూనె లేదా బాదంనూనె రాసుకోవాలి. ఒక వేళ పాలు లేకపోతే నీటిని ఉపయోగించవచ్చు.

6.కొన్ని దానిమ్మ గింజలు, మిల్క్ క్రీమ్ లో వేసి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పెదాలకు రాసుకోవాలి. ఇది రోజుకోసారి చేస్తే నెలరోజుల్లో అందమైన పెదాలు మీ సొంతమవుతాయి.

7.నీటిలో కొద్దిగా బ్రౌన్ షుగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై రాయాలి. అలాగే కొద్దిసేపు నీటిని కలుపుతూ మర్దనా చేసుకోవాలి.

9.కలబంద గుజ్జు, స్ర్టా బెర్రీ, కొద్దిగా తేనెను తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై రాసి 20 నిమిషాల తర్వాత నీటితో కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే నల్లగా ఉండే మీ పెదాలు లేతగులాబీ రంగులోకి వస్తాయి.

10.ప్రతిరోజూ మన శరీరానికి నీరు చాలా అవసరం. సమపాళ్లలో నీరు తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని డాక్టర్లు కూడా చెప్తుంటారు. అలాగే గ్లాసు నీటిలో..కొద్దిగా నిమ్మరసం వేసుకుని ప్రతిరోజూ తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గి..నల్లగా ఉండే పెదాలు మృదువుగా, పింక్ కలర్ లోకి మారుతాయి. నిమ్మరసానికి బదులుగా కీర జూస్ కూడా తాగొచ్చు..లేదా తినొచ్చు.

ఈ 10 చిట్కాలలో మీకు నచ్చిన ఏదొక చిట్కా ట్రై చేసి, నల్లగా ఉండే పెదాలను అందంగా మార్చుకునేందుకు ప్రయత్నించండి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.