మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం

By సుభాష్  Published on  15 Jun 2020 3:40 AM GMT
మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం

ఈ మధ్య వన్యప్రాణులు జనవాసాల్లోకి వస్తున్నాయి. అడవిలో ఉండే పులులు రోడ్లపైకి, జనసంచారం ఉండే ప్రాంతాల్లోకి రావడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పులులు సంచరించడం తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. మంచిర్యాల జిల్లాలోని జైపూర్‌ సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఆవరణలో పెద్ద పులి మరోసారి కనిపించడంతో ఆందోళన మొదలైంది. పవర్‌ ప్లాంట్‌ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి తిరుగుతున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఆదివారం నుంచి ప్లాంట్‌ ప్రాంతంలోనే పులి సంచరించినట్లు వారు చెబుతున్నారు.

ఈ విషయమై అధికారులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన అధికారులు గ్రౌండ్‌ లెవల్‌ పనులను నిలిపివేసి కార్మికులను అప్రమత్తం చేశారు. పులి కదలిలపై అటవీ అధికారులు నిఘా ఉంచారు. కాగా, పులి సంచరించడం అటవీ అధికారులు కూడా ధృవీకరించారు. నాలుగైదు రోజులుగా సంచరిస్తున్న పులి మేతకు వెళ్లిన పశువులపై దాడి చేసింది. ఇక తాండూరు, బెల్లంపల్లి, పట్టణ ప్రాంతాల్లో కూడా సంచరిస్తూ తాజాగా పవర్‌ ప్లాంట్‌ వద్ద కనిపించడంతో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. ఇలా పులి సంచరించడంతో సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ అధికారులు త్వరగా దానిని పట్టుకోవాలని కోరుతున్నారు.

Next Story