ముఖానికి గుచ్చుకున్న ముళ్లు.. పులి పిల్లలు విలవిల..!

By Newsmeter.Network
Published on : 24 Dec 2019 1:23 PM IST

ముఖానికి గుచ్చుకున్న ముళ్లు.. పులి పిల్లలు విలవిల..!

ముఖ్యాంశాలు

  • తిపేశ్వర్ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో గాయపడ్డ పులి పిల్లలు
  • పందికొక్కుల్ని తినే ప్రయత్నంలో మొహంలో గుచ్చుకున్న ముళ్లు
  • వాడియైన ముళ్లు గుచ్చుకోవడంవల్ల పులి పిల్లలకు బాధ
  • సాధారణంగా తల్లిపులి ఈ ముళ్లను తన నోటితో పీకేస్తుంది
  • గుచ్చుకున్న ముళ్లవల్ల పులి పిల్లలకు ఇన్ ఫెక్షన్ సోకవచ్చు

మహారాష్ట్రలోని యవత్ మల్ జిల్లాలో ఉన్న తిపేశ్వర్ వన్యమృగ సంరక్షణాలయం పులుల సంరక్షణ కేంద్రంగా ఏళ్లుగా పేరుమోసింది. నూట పాతిక కిలోమీటర్ల దూరం విస్తరించిన ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో తలదాచుకుంటున్న పులులకు ఇప్పుడు ముళ్ల పందికొక్కుల బెడద ఎక్కువయ్యింది.

సాధారణంగా పులులు ఈ ముళ్ల పందికొక్కుల్ని తినడానికి ఇష్టపడవు. కానీ పులి పిల్లలకు మాత్రం వాటి జోలికి వెళ్లకూడదన్న సత్యం గాయపడిన తర్వాత కానీ తెలీదు. ఇది ప్రకృతిలో ఇమిడిఉన్న రహస్యం. ప్రత్యర్థుల దాడినుంచి తమను తాము కాపాడుకోవడానికి పందికొక్కులకు సహజసిద్ధంగా లభించిన వరం ఈ ముళ్లు.

వీలైనంతవరకూ పెద్ద పులులు తమ పిల్లల్ని అన్ని వేళలా తమతోనే ఉండేట్టుగా చూసుకుంటాయి. తల్లి పులి వేటకు వెళ్లినప్పుడు మాత్రం పిల్లలు ఒంటరిగా ఉండిపోతాయి. ఈ సమయంలో తమ ముందు నుంచి విచిత్రంగా కదిలివెళ్లే ముళ్ల పందికొక్కులు వీటిని ఆకర్షిస్తాయి. వాటిమీద దాడిచేసి వాటిని ఆహారంగా చేసుకోవాలన్న ఆశ పులి పిల్లలకు ఉండడమూ సహజమే.

సరిగ్గా అక్కడే అవి దెబ్బ తింటాయి. వాటిని తినడంకోసం ప్రయత్నం చేసినప్పుడు చాలా వాడిగా ఉండే వాటి ముళ్లు పులి పిల్లల నోటికి, ముఖానికి గుచ్చుకుని తీవ్రంగా బాధపెడతాయి. సహససిద్ధంగా తమకు గుచ్చుకున్న ముళ్లను ఏదో ఒక రకంగా తామే తీసేసుకునే సామర్ధ్యం ప్రకృతి సిద్ధంగా వాటికి ఉండనే ఉంటుంది. అలా సాధ్యం కానప్పుడు, పులి పిల్లలు గుచ్చుకున్న ముళ్లతో బాధపడుతున్నప్పుడు తర్వాతైనా సరే తల్లి పులి వాటిని నోటితో లాగి పారేస్తుంది.

తిపేశ్వర్ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో ఇలాంటి ఓ దృశ్యం ఆకర్షణీయంగా కనిపించింది. పందికొక్కుల ముళ్లు నోటిలో, ముక్కులో, ముఖంమీద గుచ్చుకుని అవస్థ పడుతున్న పులి పిల్లలు కెమెరాల కళ్లకు చిక్కాయి.

ఔత్సాహికుడైన ఓ వైల్డ్ లైఫ్ పోటో గ్రాఫర్ ఈ చిత్రాలను తన కెమెరాలో బంధించాడు. ఒక్కోసారి పులి పిల్లల శరీరంలో ఈ ముళ్లు ఎక్కువకాలం అలా ఉండిపోతే, వాటిని అవిగానీ, వాటి తల్లి పులిగానీ తొలగించలేకపోతే పులి పిల్లలకు ఇన్ ఫెక్షన్ సోకే అవకాశంకూడా ఉంటుంది. సర్వసాధారణంగా ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లోనే అలాంటి సందర్భాల్లో పులి పిల్లలు ఆ ఇన్ ఫెక్షన్ నుంచి కూడా బయటపడతాయి.

అయితే వన్యమృగ సంరక్షణ కేంద్రం అధికారులు ఇలా ఎక్కువకాలం పందికొక్కుల ముళ్లు గుచ్చుకున్న పులి పిల్లల్ని గుర్తించి వాటి శరీరంనుంచి ఆ ముళ్లను తొలగించకపోతే ఒక్కోసారి ఇన్ ఫెక్షన్ స్థాయి పెరిగి పులి పిల్లలకు తీవ్రస్థాయి అనారోగ్యంకూడా కలిగే అవకాశం ఉంటుందని వన్యప్రాణి ప్రేమికులు అంటున్నారు.

వేటాడాలనే ఉత్సహం..

సహజంగా తల్లి పులి పిల్లల్ని మగపులికి వీలైనంత దూరంగా ఉంచుతుంది. ఎందుకంటే మగపులితోపాటుగా ఎక్కువ సమయం గడిపితే పులి పిల్లల్లోకూడా వేటాడే తత్త్వం బాగా పెరిగిపోతుందని దాని భయం. కానీ అప్పుడప్పుడూ ఇలా కళ్లముందు కనిపించిన వాడియైన ముళ్లను శరీరమంతటా కలిగి ఉన్న ఈ పందికొక్కుల్ని చూసి పులి పిల్లలు వేటాడాలని ఉత్సాహపడతాయి.

పులి పిల్లలు అటాక్ చేయగానే సహజసిద్ధమైన తమ రక్షణ కవచాన్ని పందికొక్కులు గట్టిగా విదిలించి వాటిపైన ఉన్న వాడియైన ముళ్లు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. వాటిని కొరికి చంపాలని భావించిన అమాయకపు పులి పిల్లలకు చాలా వాడిగా ఉండే ఆ ముళ్లు మొహంలో గుచ్చుకుంటాయి. అటుచేసీ ఇటు చేసీ ఆ పందికొక్క ఎలాగూ తప్పించుకుంటుంది. కానీ మొహంలో ఇరుక్కున్న ముళ్లు పులి పిల్లల్ని విపరీతంగా బాధిస్తాయి.

వయసు పెరిగేకొద్దీ వాటి జోలికి వెళ్లడంవల్ల హాని కలుగుతుందన్న జ్ఞానం పులి పిల్లలకు కలుగుతుంది. విపరీతమైన కరవు ఎదురైన సందర్భాల్లో తప్ప మళ్లీ జీవితంలో ఎప్పుడూ ఆ పందికొక్కుల్ని కొరుక్కుతినాలన్న ఆలోచన పెరుగుతున్న పులి పిల్లలకు రానేరాదు. ప్రకృతిలో ఇలాంటి విచిత్రాలు ఎన్నో ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా ఉన్న విస్తారమైన అడవుల్లో ఇవి అడపాదడపా కనిపిస్తూనే ఉంటాయి.

Next Story