సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ మొత్తం మీద పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలమీదకు వచ్చింది. ఆయన మంత్రివర్గంలోని కీలక సభ్యుడు, రైల్వే మంత్రి షేఖ్ రషీద్ అహ్మద్ చేతలు ఆయనను ఇరకాటంలో పారేశాయి. మంత్రి గారి తప్పులకు ఆయన సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తోంది.

పాకిస్తాన్ లోని ఫేమస్ టిక్ టాక్ సుందరి హరీం షా చేసిన ఒక టిక్ టాక్ డాన్స్ చేస్తున్న విడియోను రిలీజ్ చేసింది. అందులో రైల్వే మంత్రి అసభ్య సంజ్ఞలు చేస్తూ, వ్యాఖ్యలు చేస్తూ కనిపించడంతో దుమారం రేగింది. మంత్రిగారిని ఒక మహిళ “నువ్వు నా ముందు నగ్నంగా నిలుచుండేవాడివి… చిలిపి చిలిపి పనులేవో చేసేవాడివి” అని అనడం ఆ విడియోలో కనిపిస్తుంది. ఆ ఫుటేజీ నిజమైనదేనని, అందులో ఉన్నది మంత్రి గారేనని ఆమె ఒప్పుకున్నారు. అంతే కాదు. తనకు తెలియకుండా తన దోస్తు దీనిని లీకు చేశారని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు మంత్రి గారిని వెనకేసుకొచ్చే పని ఇమ్రాన్ ఖాన్ మీద పడింది.

సదరు సుందరి హరీం షా కంచు కటారి. గతంలో మంత్రులతో తనకున్న దోస్తీని ఉపయోగించేసుకుని విదేశాంగ శాఖ కార్యాలయంలోని కీలక కాన్ఫరెన్స్ హాల్ లో ప్రవేశించి, మంత్రిగారు కూర్చునే సేటులో కూర్చుంది. ఆ వీడియో బయటపడేసరికి మంత్రి గారికి ముచ్చెమటలు పోశాయి. ఆ తరువాతేముంది… పైవారి గద్దింపులు, మంత్రి గారి నేల చూపులు….

హరీం షా ను చూస్తే చాలా మందికి ఒకప్పటి సోషల్ మీడియా సుందరి కందీల్ బలోచ్ గుర్తుకొస్తోంది. ఆమె ఒకప్పుడు ఒక పేరున్న మౌలానా గారి ఒళ్లో వయ్యారంగా కూర్చుని, రంజాన్ పవిత్రత గురించి వివరించమంది. ఆ విడియో బయటపడేసరికి మౌలానా పరువు పోయింది. చివరికి సోదరుడే కందీల్ ను కాల్చి చంపేశాడు. అన్నట్టు హరీం షా కి కూడా బెదిరింపుకాల్స్ వస్తున్నాయట!!

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.