పిడుగు నుంచి వచ్చే వోల్టేజీని స్టోర్‌ చేయగలమా?

By సుభాష్  Published on  28 July 2020 5:50 PM IST
పిడుగు నుంచి వచ్చే వోల్టేజీని స్టోర్‌ చేయగలమా?

పిడుగు అనేది రెండు వేర్వేరు ధ్రువత్వం గల విద్యుదావేశాలతో నిండుకున్న మేఘాల మధ్య జరిగే విద్యుదుత్సర్గం. ఒక వేళ ఒక మేఘానికి దగ్గర‌లో మరో మేఘం లేనట్లయితే మేఘంలో ఏ ధ్రువత్వం గల విద్యుదావేశం కలిసిందన్న విషయంలో సంబంధం లేకుండా ఆ స్థిర విద్యుత్తు భూమి వైపు ప్రసరిస్తుంది. ఆ సమయంలో మేఘానికి దగ్గరగా ఎవరున్నా అంటే చెట్లు, భవనం, విద్యుత్ స్తంభం, వ్యవసాయదారుడు లేదా దారిన పోయేవారు, లేదా పశువులు ఇలా విద్యుత్ ప్ర‌వ‌హించిన‌ట్ల‌యితే వారి గుండా ఈ అధిక విద్యుత్తు ప్రవహించి మరణానికి దారి తీస్తుంది. ప్రతి ఏటా ఈ పిడుగు పాటుకు ఎందరివో ప్రాణాలు పోతున్నాయి. ఎక్కువ‌గా పొలాల్లో ప‌నులు చేసుకునే వారిపై, చెట్ల కింద ఉన్న‌వారిపై ఈ పిడుగు ప్ర‌భావం అధికంగా ఉంటుంది. ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో, పొలాల్లో ఉన్న వ్యక్తులు ఈ పిడుగు పాటుకు గురవుతుంటారు.

ఇలాంట పరిణామాన్ని మనం పిడుగు పాటు అంటాం. పిడుగు పడే సమయంలో విద్యుత్తు ఉన్న మేఘానికి, భూమికి మధ్య కొన్ని లక్షల వోల్టుల విద్యుత్తు పొటన్షియల్‌ ఉంటుంది. ఈ విద్యుత్ ప్రవాహం కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఉంటుంది. అదే పనిగా గంటల తరబడి కొనసాగదు. అంత తక్కువ వ్యవధిలో అంత అధిక మోతాదులో ఉన్న విద్యుత్తును నిల్వ చేయగల పరికరాలు, సాధనాలు లేవు. ప్రవహించే విద్యుత్తును దాచుకొని ఆ తర్వాత వాడుకోగలిగిన వ్యవస్థలు భౌతికంగా కెపాసిటర్లు, రసాయనికంగా ఛార్జబుల్‌ బ్యాటరీలు మాత్రమే! కానీ పిడుగు పడే సమయంలో వాటిని పిడుగు మార్గంలో ఉంచితే అవి కాలిపోవడం మినహా విద్యుత్తు నిల్వ ఉండటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ల‌క్ష‌ల వోల్టులు క‌లిగిన విద్యుత్ ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది.

Next Story