ఇజ్రయెల్‌లో మరో మూడు వారాలు లాక్‌డౌన్
By సుభాష్ Published on 14 Sep 2020 7:54 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే లాక్‌డౌన్ విధించి అన్‌లాక్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను విధించి నిబంధనలు కఠినతరం చేసినా వైరస్ మాత్రం కట్టడి కాలేకపోతోంది. పైగా మరింత వ్యాప్తి చెందుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుదేలవుతోంది. దీంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను సడలిస్తూ అన్‌లాక్ మొదలు పెట్టాయి. అయితే కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా లాక్‌డౌన్ కొనసాగుతోంది.
ఇక ఇజ్రాయిల్‌లో మరోసారి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో మూడువారాల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మూడు వారాల తర్వాత పరిస్థితిని బట్టి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిపోయింది. ఇప్పుడు రెండోసారి లాక్‌డౌన్ విధిస్తే కనీసం 1.88 బిలియన్‌డాలర్లు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆ దేశ ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. మెడికల్స్, సూపర్ మార్కెట్లు తన్ని మూసివేస్తున్నారు.
ఇక దేశంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అయితే యాదుల కొత్త సంవత్సరానికి ముందు ఈ నిర్ణయం తీసుకోవడం కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇజ్రయెల్‌లో ఇప్పటి వరకు 1,53,759 కరోనా కేసులు నమోదయ్యాయి. వెయ్యికి పైగా కరోనా బారిన పడి మరణించారు.
అలాగే భారత్‌లో కూడా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,78,500 కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా 92,071 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 1,136 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 48,46,428కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణాల సంఖ్య 79,722కు చేరింది. దేశంలో రికవరీ రేటు 78 శాతం ఉండగా, మరణాల రేటు 1.64కు చేరింది.
ప్రపంచ వ్యాప్తంగా జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు 28,90,2,170 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో 9 ,22,735 మంది మృతి చెందారు. అలాగే 65,19,555 కేసుల, 1,94,273 మరణాలతో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో భారత్ ఉంది.