తెలంగాణలో దిశ అత్యాచారం, హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. విచారణలో భాగంగా నిందితురాలిని హత్య చేసి దహనం చేసిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌కు చేస్తుండగా, నిందితులు పరారయ్యేందుకు యత్నించి, పైగా పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు నలుగురిని ఎన్‌కౌంటర్‌ చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు పోలీసులపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ పోలీసులు నిజమైన హీరోలని, వారిని చూసి ఇతర రాష్ట్రాల పోలీసులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా, గడిచిన ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు సంచలన ఎన్‌కౌంటర్లు జరుగగా, . ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్ మూడోది.​

మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ వికారుద్దీన్‌:

దేశంలోని అనేక నేరాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ వికారుద్దీన్‌ను 2014, ఏప్రిల్ 7న వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దులో తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో ఆరుగురు పోలీసులను కాల్చి చంపిన ఘటనతో పాటు గుజరాత్ హోంమంత్రిపై దాడి ఘటనలో వికారుద్దీన్‌ ప్రధాని నిందితుడు. 2010 జూలై 15న విశాఖ నుంచి వరంగల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచీ కోర్టుకు తీసుకువెళ్లే ప్రతిసారీ పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు వికారుద్దీన్ ప్రయత్నిస్తూనే ఉండేవాడు.

ఈ క్రమంలోనే 2015 ఏప్రిల్ 7న వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దులో కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులపై వికారుద్దీన్‌తో పాటు వికార్‌ అహ్మద్‌, సయ్యద్‌ అంజాద్‌ అలియాస్‌ సులేమాన్‌, ఇజార్‌ఖాన్‌, మహ్మద్‌ అనీఫ్‌, మహ్మద్‌ జకీర్‌ దాడికి ప్రయత్నించి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసుల ఆయుధాలు లాక్కుని వారిపైనే కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన వికారుద్దీన్ గ్యాంగ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. వరంగల్ జైలు నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా జనగామ దాటాక, ఆలేరు సమీపంలోని కాకతీయ తోరణం దగ్గర టాయిలెట్ కోసం వాహనం ఆపాలని అడిగారు. అక్కడే వారు పోలీసులపై దాడికి పాల్పడేందుకు యత్నించి ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.

నయీం ఎన్‌కౌంటర్ :

అలాగే తెలుగు రాష్ట్రాల్లో అనేక భూ సెటిల్‌మెంట్లు, కబ్జాలు, హత్యలు చేస్తూ వేల కోట్ల రూపాయల ఆస్తులు పోగేసి ప్రభుత్వానికి సవాల్‌గా మారిన గ్యాంగ్‌స్టర్ నయీం. ఎంతో మందికి బెదిరింపులు చేస్తూ, పెద్ద మొత్తంలో ఆస్తులు అక్రమంగా సంపాదించి , అధిక మొత్తంలో డబ్బులను సంపాదించాడడు. పోలీసులు 2016, ఆగస్టు 8న ఎన్‌కౌంటర్‌ చేసి చంపేశారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ గ్రామంలోని మిలీనియం టౌన్ షిప్ లోని ఓ ఇంట్లో నయీం తలదాచుకున్నట్లు పక్కా సమాచారం తో పోలీసులు చుట్టుముట్టి నయీంను ఎన్‌కౌంటర్‌ చేశారు. నయీం అనుచరులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపారు. ఈ కాల్పుల్లో నయీం అక్కడికక్కడే చనిపోయాడు. నయీంపై వందల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.

‘దిశ’ నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్:

నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అంతటి సంచలనంగా మారిన దిశ ఘటన. వెటర్నరీ వైద్యురాలిపై నలుగురు యువకులు అత్యాచారం, హత్యకు పాల్పడ్డారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద ‘దిశ’ను దహనం చేసిన చోటికి గురువారం అర్ధరాత్రి పోలీసులు నిందితులను తీసుకెళ్లారు. అక్కడ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోయేందుకు యత్నించారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఆ నలుగురిని ఎన్‌కౌంటర్‌ చేశారు. వీరి  ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కేసును పర్యవేక్షిస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సోషల్‌మీడియాలోనూ ‘సాహో సజ్జనార్’కీర్తిస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.