వారి దగ్గర కరోనా వైరస్‌కు మందు ఉందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 April 2020 11:34 AM GMT
వారి దగ్గర కరోనా వైరస్‌కు మందు ఉందా..?

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీనికి వ్యాక్సిన్ ను కనుక్కోవడం కోసం ఎన్నో ఫార్మా కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కొన్నేమో ప్రభుత్వాల అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. మరికొన్ని మనుషులపై ప్రయోగాలను మొదలుపెట్టేశాయి. ఇలాంటి సమయంలో అమెరికాలో ఓ గ్రూప్ దగ్గర కరోనాకు చికిత్స ఉందని వాల్ స్ట్రీట్ జనరల్ సంస్థ సంచలన కథనాన్ని వెల్లడించింది.

ఓ టాప్ సైంటిస్టులు ఉన్న గ్రూప్ కు పలువురు బిలియనీర్లు ఫండ్స్ అందిస్తూ వస్తున్నారు. వారు కరోనా మహమ్మారిని అడ్డుకోడానికి కావాల్సిన చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే తయారు చేశారని చెబుతున్నారు. వారి దగ్గర కరోనా మహమ్మారిని పారద్రోలడానికి చేపట్టాల్సిన చర్యలకు సంబంధించిన పూర్తీ నివేదిక ఉందని.. ఇప్పటికే వైట్ హౌస్ కు తమ ప్రతిపాదనలను పంపినట్లు వాల్ స్ట్రీట్ జనరల్ పేర్కొంది.

ఒక డజనుకు పైగా డాక్టర్లు ఉన్న గ్రూప్ కు 33 సంవత్సరాల డాక్టర్ థామస్ కాహిల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈయన బోస్టన్ లోని ఫెన్ వే పార్క్ దగ్గరగా కేవలం వన్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో నివసిస్తున్నా కూడా వైట్ హౌస్ తో సంప్రదింపులు చేయగలిగిన సమర్థుడు. ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న శాస్త్రవేత్తల టీమ్ లో కెమికల్ బయాలజిస్టులు, ఇమ్యునో బయోలజిస్ట్, న్యూరో బయోలజిస్ట్, క్రోనో బయోలజిస్ట్, అంకోలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్, ఎపిడెమియాలజిస్ట్, న్యూక్లియర్ బయోలాజిస్ట్ ఉన్నారు.

ప్రస్తుతం దీన్ని మ్యాన్ హట్టన్(రెండవ ప్రపంచయుద్ధం సమయంలో న్యూక్లియర్ వెపన్ అయిన ఆటం బాంబ్ ను కనుక్కోవడమే ఒరిజినల్ మ్యాన్ హట్టన్ ప్రాజెక్టు) ప్రాజెక్ట్ తో పోలుస్తున్నారు. ఎందుకంటే ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న కరోనా మహమ్మారికి సంబంధించిన టీకా వీరు తయారు చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా ఆ పేరుతోనే పిలుస్తున్నారు.

డాక్టర్ థామస్ కాహిల్ నేతృత్వంలోని టీమ్ 'కరోనా మహమ్మారిని ఎదుర్కొనే టీమ్' గా అభివర్ణించుకుంటూ ఉన్నారు. ఆ టీమ్ ను తక్కువగా అంచనా వేయడానికి కూడా లేదు. ఎందుకంటే అందులోని సభ్యుడు బయాలజిస్ట్ అయినా మైఖేల్ రోస్బాష్ కు 2017లో నోబెల్ బహుమతి కూడా లభించింది. ప్రస్తుతం వీరంతా వైట్ హౌస్ తో మంతనాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రముఖ ఫార్మా కంపెనీలతో సంప్రదింపులు చేస్తూ ట్రంప్ దాకా వెళ్లే లింక్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ విషయం అమెరికా ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులకు కూడా తెలుసు. వారు చేసిన ప్రయోగాలకు సంబంధించి 17 పేజీల రిపోర్టును కూడా తయారు చేసి పెట్టుకున్నారు. కొన్ని విధాలుగా ట్రీట్మెంట్ ఇవ్వడం వలన కరోనా మహమ్మారిని పారద్రోలవచ్చని వారు బలంగా నమ్ముతున్నారు. గతంలో ఎబోలా వైరస్ చికిత్సకు వాడిన మందు విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. కరోనా పేషెంట్స్ పై కూడా డోస్ లలో మార్పులు చేస్తే.. మంచి ఫలితాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ బృందం ఇచ్చిన రిపోర్టులను కేబినెట్ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కూడా చూశారట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ టీమ్ ను మైక్ పెన్స్ లీడ్ చేస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ కోలిన్స్ కూడా ఈ రిపోర్టులను చూశారని, రిపోర్టులో ఇచ్చిన రెకమెండేషన్స్ ను పరిగణలోకి తీసుకుంటామని చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జనరల్ ప్రస్తావించింది.

ఈ టీమ్ హెడ్ అయిన థామస్ కాహిల్ దగ్గర ఉన్నది ఒకే ఒక్క సూట్ అయినప్పటికీ.. ఎంతో మంది బిలియనీర్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పీటర్ థీల్, జిమ్ పలోటా, మైఖేల్ మిల్కెన్ లాంటి బిలీనియర్లు థామస్ కాహిల్ టీమ్ కు అండగా ఉన్నారు. వీరందరూ తమ టీమ్ రిపోర్టు ప్రభుత్వం దాకా చేరేలా చేశారని కాహిల్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ట్రంప్ టీమ్ తో కాహిల్ బృందం ఫోన్ కాల్ లో టచ్ లో ఉంది. తమ బృందం లోని సభ్యులెవరూ ప్రస్తుతం డబ్బు ఆశించడం లేదని కాహిల్ అన్నారు. ప్రస్తుతం తామందరూ సమాజ హితం కోసం పోరాడుతున్నామని అన్నారు కాహిల్. తమ రిపోర్టుల కారణంగా సత్ఫలితాలు లభిస్తే మాత్రం ప్రపంచాన్ని మార్చే అవకాశం ఉందని అన్నారు.

Next Story