నగరంలో సరికొత్త 'చిల్డ్రన్‌ పార్క్'‌.. ప్రత్యేకతలివే..!

By అంజి  Published on  23 Nov 2019 7:39 AM GMT
నగరంలో సరికొత్త చిల్డ్రన్‌ పార్క్‌.. ప్రత్యేకతలివే..!

ముఖ్యాంశాలు

  • గచ్చిబౌలిలో సరికొత్త టెక్నాలజీతో చిల్డ్రన్‌ పార్క్‌ ప్రారంభం
  • పార్క్‌ను ప్రారంభించిన మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎంపీ రంజిత్‌ రెడ్డి
  • 7000 చదరపు అడుగుల వైశాల్యంలో చిల్డ్రన్‌ పార్క్‌
  • పిల్లలు కిందపడినా దెబ్బ తగలకుండా సింథటిక్‌ రబ్బర్‌ ఏర్పాటు

హైదరాబాద్‌: నగరంలో చిన్న పిల్లల కోసం మరో పార్క్‌ అందుబాటులోకి వచ్చింది. చిన్న పిల్లలు ఎగిరి గంతేసేందుకు కొత్త అడ్వెంచర్స్‌తో చిల్డ్రన్‌ పార్క్‌ను జీహెఎచ్‌ఎంసీ నిర్మించింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి జయభేరి ఎన్‌క్లేవ్‌ సమీపంలోని డాగ్‌పార్క్‌ల నిర్మించిన చిల్డ్రన్‌ పార్క్‌ను ఏర్పాటు చేశారు. కాగా ఇవాళ ఉదయం మేయర్ బొంతు రామ్మోహన్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, వెస్జ్‌జోన్‌ కమిషనర్‌ హరిచందన చిల్డ్రన్‌ పార్క్‌ను ప్రారంభించారు. పిల్లల ఆహ్లాదం కోసం సుమారు 7000 చదరపు అడుగుల వైశాల్యంలో చిల్డ్రన్‌ పార్క్‌ను ఏర్పాటు చేశారు. పార్క్‌లో పిల్లల కోసం గేమ్స్‌కు సంబంధించిన పరికరాలతో పాటు పెద్దల కోసం ఓపెన్‌ జిమ్‌ను కూడా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

పార్క్‌లో పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులు, సొరంగాలు, మట్టి పిరమిడ్లు, కృత్రిమ పుట్టలు, మట్టి దిబ్బలు, స్లైడింగ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. పిల్లలు కిందపడినా దెబ్బ తగలకుండా సింథటిక్‌ రబ్బర్‌ (ఈపీడీఎం)ను, ఆహ్లాదకరమైన పచ్చికను నేలపై ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. అలాగే, సెల్ఫీ స్టాండ్, వివిధ రకాల పండ్లు, కాయలు కూడా అందుబాటులో పెట్టారు. సోలార్ ఎల్‌ఈడీ లైట్లు, కంపాస్, అల్ఫాబెట్స్, నెంబర్స్ తదితర కొత్తరకం ఈపీడీఎం డిజైన్‌ను కూడా ఏర్పాటుచేశామని అధికారులు తెలిపారు. పిల్లల వయస్సును బట్టి అధికారులు ఆటవస్తువులను అందుబాటులో ఉంచారు. చిన్న, పెద్ద గుట్టలు.. కీర, టమాట, క్యాప్సీకం, యాపిల్ వంటి పండ్లు, కురగాయల వంటి బొమ్మలు పిల్లలను అలరించనున్నాయి. రాత్రి సమయంలో కూడా పిల్లలు ఆడుకునేందుకు సోలార్‌ ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు.

పిల్లల ఆనందానికి ఏ అడ్డూ తగలని విధంగా పార్క్‌ను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. కొత్త విధానంతో అడ్వెంచర్‌ పార్క్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్‌ కమిషనర్‌ హరిచందన తెలిపారు. రూ.40 లక్షల వ్యయంతో డాగ్‌ పార్క్‌ పక్కన చిల్డ్రన్‌ పార్క్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రత్యేక థీమ్‌తో ఆ పార్క్‌ను నిర్మించేందుకు వెస్ట్‌జోన్‌ కమిషన్‌ హరిచందన విశేష కృషి చేశారు. చిన్నారులకు ఆహ్లదాన్ని కలిగించేందుకే ఈ పార్క్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు కమిషనర్‌ హరిచందన. జర్నలిస్టుల కాలనీలో పంచతంత్ర పార్క్‌, గచ్చిబౌలిలోని జయభేరి ఎన్‌క్లేవ్‌ సమీపంలో ఈపీడీఎం పార్క్‌ను అభివృద్ధి చేశామన్నారు. డాగ్‌ పార్క్‌ వద్ద పెద్దల కోసం ప్రత్యేకంగా ఓపెన్‌ జిమ్‌ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని హరిచందన పేర్కొన్నారు.

Next Story