భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పిని స్మరించుకుందాం..

By సుభాష్  Published on  28 Feb 2020 10:57 AM GMT
భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పిని స్మరించుకుందాం..

డాక్టర్ రాజేంద్రప్రసాద్‌. భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి. 1884, డిసెంబర్‌ 3న బీహార్‌లోని శివాన్‌ జిల్లా జెర్దాయ్‌ గ్రామంలో జన్మించిన రాజేంద్రప్రసాద్‌.. 1963, ఫిబ్రవరి 28న మరణించారు. నేడు ఆయన వర్థంతి. 1950 నుంచి 1962 వరకు రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టారు. రాజేంద్రప్రసాద్‌ను ప్రేమగా బాబు అని పిలిచేవారు. భారత రాజకీయ నాయకునిగా భారత జాతీయ కాంగ్రెస్‌లో భారత స్వాతంత్య్రోధ్యమ కాలంలో చేరారు. అంతేకాదు బీహార్‌లో ప్రముఖ నాయకునిగా ఎదిగారు. మహాత్మగాంధీ మద్దతుదారునిగా 1931లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, 1941లో జరిగిన క్విట్‌ ఇండియా ఉధ్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు

1946 ఎన్నికల తర్వాత రాజేంద్రప్రసాద్‌ ఆహారం, వ్యవసాయ శాఖకు భారత ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. రాజేంద్రప్రసాద్‌ భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. 1948 నుంచి 1950 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పాటు చేసిన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. 1950లో భారత గణతంత్ర రాజ్యాంగం అవతరించిన తర్వాత రాజ్యాంగ పరిషత్తు ద్వారా మొదటి రాష్ట్రపతి గా ఎన్నుకోబడ్డారు. అలాగే 1951లో సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటి భారత పార్లమెంట్‌ ఎలక్టోరల్‌ కాలేజ్‌ ద్వారా రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు. అంతేకాకుండా అప్పటి ప్రధాని జవహాల్‌లాల్‌ నెహ్రూకు వివిధ సందర్భాలలో సలహాలు, సూచనలు కూడా ఇచ్చేవాడట. 1957లో అతడు రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికై రెండు సార్లు భారత రాష్ట్రపతి పదవినలంకరించిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు.

12 సంవత్సరాల వయసులోనే వివాహం

హిందీ భాష, అంకగణితంను నేర్చుకోవడానికి ఒక మౌల్వీ వద్దకు వెళ్లాడు. తర్వాత ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి, 12సంవత్సరాల వయసులోనే రాజ్‌వంశీ దేవిని వివాహం చేసుకున్నారు. తర్వాత విద్యకోసం పాట్నాలోని తన అన్న మహేంద్రప్రసాద్‌ వద్ద ఉంటూ, ఆర్‌ కెఘెష్‌ పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో చేరి కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశపరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై నెలకు రూ. 30 ఉపకారవేతనం అందుకున్నారు. 1902లో కలకత్తా ప్రసిడెన్సీ కాలేజీలో చేరారు. 1904 కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఎఫ్‌ఏ ఉత్తీర్ణుడయ్యారు.

అనేక సంస్థల్లో ఉపాధ్యాయునిగా..

రాజేంద్రప్రసాద్‌ ఉపాధ్యాయునిగా అనేక విద్యాసంస్థల్లో పని చేశారు. ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తిచేసి తర్వాత బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ లాంగట్‌ సింగ్‌ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకుడిగా చేరారు. అలాగే ఆ సంస్థకు ప్రధానచార్యునిగా సేవలందించారు. 1909 కలకత్తాలోని రిప్పన్‌ కళాశాలలో న్యాయవాద విద్యను అభ్యసించడానికి ఉద్యోగాన్ని వదిలివెళ్లారు

న్యాయవాదిగా..

1911లో కాంగ్రెస్‌లో చేరారు. 1916లో బీహార్‌, ఒడిషా రాష్ట్రాల హైకోర్టులలో చేరారు. 19017లో పాట్నా విశ్వవిద్యాలయంలోని సెనేట్‌, సిండికేట్‌లో మొదటి సభ్యునిగా నియమింపబడ్డారు. బీహార్‌లోని భగల్‌పూర్‌లో న్యాయవాద ప్రాక్టీసును చేపట్టారు.

భారత స్వాతంత్ర్యం వచ్చిన రెండున్నర సంవత్సరాల తర్వాత 1950 జనవరి 26న స్వాతంత్ర్య భారత రాజ్యాంగం ఆమోదించబడింది. రాజేంద్రప్రసాద్‌ను మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. భారతదేశానికి అధ్యక్షునిగా రాజ్యాంగం ప్రకారం బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి చెందకుండా స్వతంత్రుడిగా వ్యవహరించారు. ఇలా 12 సంవత్సరాల పాటు భారత రాష్ట్రపతిగా సేవలందించి 1962లో పదవీ విరమణ చేశారు.

అలాగే 1962, సెప్టెంబర్‌లో రాజేంద్రప్రసాద్‌ భార్య రాజ్‌వంశీ దేవి మరణించారు. ఇక 1963 ఫిబ్రవరి 28న రాం రాం అంటూ రాజేంప్రసాద్‌ కూడా కన్నుమూశారు. కాగా, మరణానికి నెల రోజుల ముందు తనకుతానే ఒక ఉత్తరం రాసుకున్నారు. అందులో ఇలా చెప్పాడు. ''నేను అంతిమ దశకు చేరువైనట్లు అనిపిస్తుంది, ఏదైనా చేసే శక్తి అంతమవుతుంది, నా ఉనికే అంతమవుతుంది'' అని ఉత్తరంలో రాశారు.

అనంతరం భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన భారతరత్న పురస్కారాన్ని రాజేంద్రప్రసాద్‌కు ప్రకటించారు. పాట్నాలో 'రాజేంద్ర స్మృతి సంగ్రహాలయం' ను అతనికి అంకితం చేశారు. దేశ ప్రజలలో ఆయనకు ఉన్న అచంచలమైన ప్రేమాభిమానాల వల్ల ఆయనను దేశ్‌ రత్న అని పిలిచేవారు.

Next Story