ఇక..దాదా శకం..! - పార్ట్‌-2

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 6:42 AM GMT
ఇక..దాదా శకం..! - పార్ట్‌-2

ఐసీసీ నిధులు-క్రికెటర్ల కాంట్రాక్టులు

దాదాపు 33 నెలలు తర్వాత బీసీసీఐ కార్యకలాపాల నిర్వహణ సుప్రీం కోర్టు నియమించిన పాలకవర్గం నుంచి బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైన గంగూలీ చేతికి వచ్చింది. ఇప్పటికే అయిదేళ్లు బెంగాల్‌ అసోసియేషనలో విధులు నిర్వహించిన దాదా లోథా సిఫార్సుల కారణంగా బీసీసీఐ అధ్యక్ష పదవిలో మరో 10 నెలలు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. ఈలోపు అతడు పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. రెండున్నరేళ్లగా బీసీసీఐ పెద్దలు అధికారానికి దూరం కావడం.. బోర్డు పాలన వ్యవహారాలు సుప్రీం నియమించిన సీఓఏ సభ్యులు చూడడంతో ఐసీసీపై భారత పట్టు కోల్పోయింది. ఫలితంగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా బోర్డులు ఐసీసీ నిధులను తమ దేశాలకు మళ్లించడం ప్రారంభించాయి. ఈ తతంగానికి అడ్డుకట్ట వేసి ఐసీసీ ఆదాయంలో సింహభాగాన్ని భారతకు తీసుకురావడం బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ముందున్న అతిపెద్ద సవాల్‌.

మరో ప్రధాన సమస్య ఆటగాళ్ల కాంట్రాక్టులు. బీసీసీఐ నాలుగు గ్రేడ్‌లుగా విభజించి ఆటగాళ్లకు జీతాలు చెల్లిస్తుంది. ఇందులో ఏ-ప్లస్‌ గ్రేడ్‌లోని ప్లేయర్లకు రూ.7 కోట్లు ఇస్తోంది. ప్రస్తుతం రోహిత, విరాట్‌, బుమ్రా మాత్రమే ఈ కేటగిరీలో ఉన్నారు. అజింక్యా రహానె, చటేశ్వర్‌ పుజారా వంటి టెస్టు క్రికెటర్లు తక్కువ జీతాలు అందుకుంటున్నారు. దీనిపై కెప్టెన్‌ కోహ్లీ కూడా వారికి గౌరవ వేతనాలు చెల్లించాలని మీడియా ముందు వ్యాఖ్యానించడంతో ఆ సమస్య తీవ్రత అర్ధమవుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, హైదరాబాద్‌ బోర్డులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తగ్గించి ఇతర క్రికెట్‌ బోర్డులను అభివృద్ధి చేయడం, దేశవాళీ క్రికెట్లో మార్పులు తీసుకురావడం, ప్రతిభగల వర్ధమాన ఆటగాళ్లను వెతికిపట్టుకుని సానపెట్టడం గంగూలీ ముందున్న ప్రధానాంశాలు.

బెంగాల్‌ రాజకీయ సెగ

కమ్యూనిస్టుల కంచు కోటైన పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసిన తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి సౌరవ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. వామపక్ష, సెక్యులర్‌ భావాలు గల గంగూలీ తొలి నుంచి బీజేపీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. రాజకీయ అవసరాల నేపథ్యంలో ఇటీవల మమత సౌరవ్‌కు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్నారు. బీజేపీ అనాధికారిక ఆహ్వానాన్ని గంగూలీ సున్నితంగా తిరస్కరించినా అతడికి బీసీసీఐ పగ్గాలు దక్కడంలో అనేక కారణాలు దాగి ఉన్నాయి. ప్రసుత్త కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ బీసీసీఐ అధ్యక్షుడిగా తప్పుకున్నాక బోర్డుపై బీజేపీ పట్టు కోల్పోయింది. అనూహ్యంగా గంగూలీ పేరును తెరపైకి తీసుకొచ్చి అతడితో సరితూగే అభ్యర్థిని పోటీ పెట్టకుండా ప్రత్యర్థులకు చెక్‌ పెట్టింది. గంగూలీ వద్ద రాజకీయాల చర్చను తీసుకురాకుండా అతణ్ణి బీసీసీఐ అధ్యక్షుడిగా పోటీ చేయించడంలో అమిత షా సఫలీకృతులయ్యారు. దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు మినహా అన్ని కీలక పదవులను బీజేపీ వర్గీయులు దక్కించుకోగా బెంగాల్‌లో తృణముల్‌కు గంగూలీ మధ్య గోడ కట్టడం ప్రారంభించారు. ప్రస్తుతం గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడే అయినా ఈ రాజకీయ చదరంగంలో ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి.

హారిక.ఎస్‌ (స్పోర్ట్స్‌ ఎనలిస్ట్‌)

Next Story