మన ముందు తరంతో పోలిస్తే..ఈ తరం ఆహారపు అలవాట్లలో చాలా తేడా ఉంటుంది. ఆ తేడాకు తగ్గట్టుగానే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. విచ్చలవిడిగా వెలుస్తున్న ఫాస్ట్ ఫుడ్, స్ర్టీట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లకు చాలా మంది బానిసలైపోతున్నారు. ముఖ్యంగా యువత..చాలా త్వరగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అలవాటుపడిపోతుంది. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. ఇంట్లో అమ్మ వండే రొటీన్ వంటకాలు నచ్చకపోవడం..చదువు, లేదా ఉద్యోగం నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు హాస్టల్ ఫుడ్ సరిపడకో..రూమ్ లో వంట చేసుకోలేకో..యువత ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఆధారపడుతుంటుంది. ఇక వేసవి వచ్చిందంటే చాలు.. మిల్క్ షేక్ లని, ఫ్రూట్ జ్యూస్ లని, ఐస్ క్రీమ్ లని తెగ ఖర్చుపెడుతుంటారు. నిజానికి వాటి వల్ల వచ్చే ఆరోగ్యం కన్నా అనారోగ్యమే ఎక్కువ. ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, కేక్, బర్గర్లు ఇలా ఇష్టమొచ్చినవి తినడం వల్ల చాలా మంది తమ శరీరాకృతిని కోల్పోతుంటారు. తిరిగి బరువు తగ్గించుకోవడానికి జిమ్ లకు, వాకింగ్ లకు..ఇంకా ఏవేవో చేస్తుంటారు. జిమ్ కు వెళ్లకుండా..డైటింగ్ చేయకుండా బరువు తగ్గాలనుకునేవారికోసం..10 ఈజీ వ్యాయామాలను పరిచయం చేస్తున్నాం..వీలైతే ట్రై చేయండి..

Bicycles 1

1.బై సైకిల్ క్రంచెస్
ఇది శరీరానికి చక్కటి వ్యాయామం. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు త్వరగా కరిగించడంలో చాలా తోడ్పడుతుంది. ఒక క్లాత్ ను మీరు పడుకునేందుకు వీలుగా నేలపై పరచాలి. దానిపై పడుకుని మొదట ఉన్న ఫొటోలా చేయాలి. మీ చేతులను తల కింద పెట్టి పైకి, కిందకు లేస్తూ ఉండాలి. ఇక రెండు, మూడు ఫొటోలలో చూపించినట్లుగా తల కింద ఉన్న మీ మో చేయి మీ మోకాలికి తగిలే విధంగా తిరుగుతుండాలి. అలా కుడి, ఎడమ చేతుల వైపు చేస్తుండాలి.

Jump Squats 2

2. జంపింగ్ స్క్వాట్స్
ఇది ప్రతిరోజు చేయాల్సిన వ్యాయామం. ఇలా చేయడం వల్ల తొడ, పొట్ట భాగాలలో పేరుకున్న కొవ్వులో కదలిక వచ్చి..వాటిని తగ్గిస్తుందీ వ్యాయామం. నిటారుగా నిల్చుని..పాదాలను పైకి, కిందికి కదుపుతుండాలి. అలాగే మీ మోకాళ్లను 45 డిగ్రీల కోణంలో వంచి పైకి లేస్తుండాలి. ఇలా పైన చూపించిన ఫొటోలో వలె రోజుకు 10-15 సార్లు వ్యాయామం చేయాలి.

Lunges 3

3.స్టాండింగ్ లంగ్స్
పైన చూపిన ఫొటోలో వలె నిటారుగా నిల్చుని..శరీరం మొత్తం ఎక్కడా వంగి ఉండకుండా చూసుకోవాలి. రెండు చేతులు నడుంపై పెట్టి..భుజాలు సమానంగా ఉంచాలి. కుడికాలు ముందుకు వంచి..ఎడమకాలిని వెనక్కి పెట్టుంచాలి. ఇలా మీరు ఉండగలిగినంత సేపు వ్యాయామం చేయాలి.

Wall Push Ups 4

4.వాల్ పుష్ అప్స్
సాధారణంగా పుష్ అప్స్ ఎక్కువ శాతం మగవారు చేస్తారు. పుష్ అప్స్ చేసే ఆడవాళ్ల సంఖ్య తక్కువనే చెప్పాలి. నేల మీద పుష్ అప్స్ చేసిన మాదిరే గోడ మీద పుష్ అప్స్ చేయొచ్చు. ఇక్కడ చూపించిన ఇమేజ్ లో లాగా రెండు చేతులను గోడమీద పెట్టి పుష్ అప్స్ చేస్తుండాలి. ఇలా మీరు చేయగలిగినన్ని పుషప్స్ రోజూ చేయడం వల్ల..శరీరంలో కదలిక వచ్చి కొవ్వు కరుగుతుంది.

Jumping Jacks 5

5.జంపింగ్ ప్యాక్
చిన్న పిల్లలు రోజూ ఎగురుతుంటారు. అందుకే వాళ్లలో కొవ్వు పెరుగుదల అంతగా కనిపించదు. ఇప్పుడు మనం చేయాల్సిన వ్యాయామం కూడా అదే. పైన చూపించిన ఫొటోలో వలె రెండు కాళ్లను సమానంగా ఉంచాలి. రెండు చేతులను పైకి ఎత్తి..ఒకేసారి జంప్ చేసి కాళ్లను దూరంగా జరపాలి. ఇలా రోజుకి 10-15 సార్లు వ్యాయామం చేయాలి.

Walking On The Spot 6

6.వాకింగ్ ఆన్ ది స్పాట్
త్రెడ్ మీల్..ఇది అందరికీ తెలిసిన వ్యాయామ పరికరం. త్రెడ్ మీల్ మీద వ్యాయామం చేసే సౌకర్యం లేని వారి కోసమే..ఈ వాకింగ్ ఆన్ ది స్పాట్. అంటే నిలబడి ఉన్న చోటే నడుస్తుండటం. మనం నిలబడిన చోటే నడవడం, లేదా పరుగెత్తడం వల్ల..శరీరంలో కేలరీలు బర్న్ అవుతాయి. ఫలితంగా బరువును తగ్గించుకోవచ్చు.

Leg Lifts 7

7.లెగ్ లిఫ్ట్స్ లేదా లెగ్ రైజెస్
నేలపై ఒక క్లాత్ ను పరిచి..దానిపై పడుకోవాలి. శరీరంలోని ఏ భాగం కదలకుండా కేవలం కాళ్లను మాత్రమే కదుపుతుండాలి. పైన చూపించిన ఇమేజ్ లో వలే..నిదానంగా రెండుకాళ్లను మీకు వీలైనంత పైకి లేపాలి. కాళ్లను కిందికి దించిన తర్వాత ఒక కాలు మాత్రమే పైకి లేపాలి. అలా ఎంతసేపు లేపి ఉంచగలరో..అంతసేపు ఉంచాలి. ఇలాగే 10-15 సార్లు చేస్తుండాలి. ఈ వ్యాయామం వల్ల తొడల భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు.

Side Plank 8

8.సైడ్ ప్లాంక్స్
నేలపై పరిచిన క్లాత్ మీద ఒక పక్కకు పడుకోవాలి. మోచేతిని బేస్ చేసుకుని నిదానంగా పైకి లేవాలి. ముందు నడుంభాగం..తర్వాతి కాళ్లు పైకి లేపాలి. పాదాలు, మో చేయి తప్ప ఇంకేవీ నేలకు తాకకూడదు. ఇలా 25 సెకన్ల పాటు ఉండాలి. తర్వాత మరో వైపు తిరిగి..ఇదే వ్యాయామాన్ని చేయాలి.

Quad Stretches 9

9.స్టాండింగ్ క్వాడ్రైసెప్స్ స్ర్టెచ్
ముందుగా నిటారుగా నిలబడాలి. అలా నిలబడ్డాక..కాలిని వెనుకనుంచి పైకి మడిచి..చేతితో పట్టుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉండాలి. తర్వాత మరొక కాలితో కూడా ఇలాగే వ్యాయామం చేయాలి. కాలిని వెనుకు మడిచి నిలబడలేని వారు సపోర్ట్ కోసం కుర్చీ లేదా టేబుల్ పట్టుకోవచ్చు.

On The Spot Jogging 10

10.ఆన్ ది స్పాట్ జాగింగ్
ఇంకా నిలబడిన చోటే నడవడం గురించి చెప్పుకున్నాం కదా.. ఇప్పుడు నిలబడిన చోటే కాస్త నెమ్మదిగా పరుగెత్తాలనమాట. నిటారుగా నిలబడి..మీ మోకాలిని వీలైనంత వరకూ పైకి లేపుతుండాలి. ఇలా చేయడం వల్ల మీ గుండెకు చాలా మంచిదని చెప్తున్నారు వైద్యులు. ఇలా రోజుకి 30 నిమిషాలు చేయాలట.

గమనిక

పైన చెప్పిన వ్యాయామాల్లో మీరు ఏదైతే సులభంగా చేయగలరో..దానినే ఎంచుకోండి. వ్యాయామం చేసే ముందు ఎక్కువగా ఆహారం తీసుకోకూడదు. వీలైనంత వరకూ ఖాళీ కడుపుతో కాకుండా డ్రై ఫ్రూట్స్ తినడం, లేదా పాలు తాగిన తర్వాత వ్యాయామం చేయాలి. అలాగే వ్యాయామానికి ముందు ఎటువంటి మెడిసిన్ తీసుకోకూడదు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.