రాజస్థాన్‌లో దారుణం.. ఆలయ పూజారికి నిప్పంటించిన దుండగులు

By సుభాష్  Published on  9 Oct 2020 9:27 AM GMT
రాజస్థాన్‌లో దారుణం.. ఆలయ పూజారికి నిప్పంటించిన దుండగులు

రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదంలో ఆలయ పూజారిని కొందరు నిప్పటించించడంతో మరణించాడు. కరౌలి జిల్లాలోని సపోత్రా ప్రాంతంలో రాధాకృష్ణ ఆలయంలో పూజాధికారాలు నిర్వహించేందుకు పూజారికి 5.2 ఎకరాలు అప్పగించారు. అయితే ఈ భూమి కరౌలీలో వివాదానికి దారితీసింది. గ్రామ పూజారి బాబాలాల్‌ వైష్ణవ్‌ (50) తన భూమిని ఆనుకుని ఉన్న ఆ ప్లాట్‌లో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు స్థలం చదును చేసేపనులు చేపట్టారు. ఈ భూమి తమదని, ఇందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కైలాష్‌ మీనా అనే వ్యక్తి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ వివాదం చలికి చిలికి గ్రామపెద్దల వద్దకు చేరడంతో వారు పూజారికి అనుకూలంగా మాట్లాడారు.

ఇక ఆ భూమి తనదే అంటూ పూజారి ఆ స్థలంలో పంటను నిల్వ చేశాడు. పూజారి చదును చేసిన స్థలంలో గుడిసె నిర్మించేందుకు నిందితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగడంతో స్థలంలో ఉన్న తన పంటను ఆరుగురు వ్యక్తులు వచ్చి తగులబెట్టారని, అంతేకాకుండా తనపై కూడా పెట్రోల్‌ పోసి నిప్పటించారని స్టేట్‌మెంట్‌లో పూజారి పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో పూజారి శరీరంపై తీవ్ర గాయాలు కాగా, వెంటనే చికిత్స నిమిత్తం జైపూర్‌ ఎస్‌ఎంఎస్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడైన కైలాష్‌ మీనాను అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు.

Next Story
Share it