బంగాళాఖాతంలో గత నాలుగు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రానికి దూరంగా పశ్చిమ రాజస్థాన్‌ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరులపులతో వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది.

బంగ్లాదేశ్‌ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం వరకు ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈనెల 26న ఉత్తరాంధ్ర, యానం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఆలయాలు, పంటలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో నివాసపు ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి.

మరో వైపు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షకాలంలో ఇప్పటికే సాధారణ వర్షాపాతం కంటే 44 శాతం అధిక వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాకాలంలో నమోదైన వర్షాపాతం నివేదికను తెలంగాణ వ్యవసాయశాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారిపోయాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో గేట్లను ఎత్తి దిగువన వదులుతున్నారు అధికారులు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *