తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఏపీలో మరో హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న నాలుగైదు గంటల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు ఎవ్వరు రావొద్దని సూచించింది. అలాగే ముంపు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపింది.

ఇక తెలంగాణలో కూడా రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆ ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న24 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారనుందని, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సుభాష్

.

Next Story